అసోంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉల్ఫా (ULFA) తిరుగుబాటుకు తెర పడింది. కేంద్ర ప్రభుత్వం, అసోం సర్కార్‌తో ఉల్ఫాలోని చర్చల అనుకూల వర్గం త్రైపాక్షిక శాంతి ఒప్పందం ( Peace accord)పై సంతకాలు చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అసోం సీఎం హిమంత బిస్వ శర్మల సమక్షంలో శాంతి ఒప్పందంపై ఉల్ఫా వర్గం సంతకాలు పెట్టింది.
ఈ మెమోరాండం ఆఫ్ సెటిల్మెంట్తో హింసను విస్మరించి ప్రధాన స్రవంతిలో చేరేందుకు ఉల్ఫా అధికారికంగా అంగీకరించింది. అసోంలో అత్యంత పురాతన తిరుగుబాటు దళంగా ఉల్ఫా దళం ఉంది. అరబిందా రాజ్‌ఖోవా నేతృత్వంలోని వర్గంతో 12 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం బేషరతుగా చర్చలు జరుపుతోంది. ఈ శాంతి ఒప్పందంతో అసోంలో దశాబ్దాల నాటి తిరుగుబాటును పూర్తిగా తెరపడనుంది.
ఈ చర్చలను పరేష్ బారుహ్ నేతృత్వంలోని ఉల్ఫాలోని కరడుగట్టిన వర్గం వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో శాంతి ఒప్పందంలో భాగమయ్యేందుకు ఆ వర్గం నిరాకరించింది. తాజా ఒప్పందం నేపథ్యంలో అక్రమ వలసలు, తెగలకు భూమి హక్కులు, అసోం అభివృద్ధి కోసం ఆర్థిక ప్యాకేజీ లాంటి సమస్యలు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అసోం భవిష్యత్తుకు ఈరోజు చాలా అద్బుతమైన రోజు అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. చాలా కాలంగా అసోం, ఈశాన్య రాష్ట్రాలు హింసను ఎదుర్కొన్నాయని వెల్లడించారు 2014లో ప్రధాని మోడీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాల మధ్య అంతరాన్ని తగ్గింంచేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని చెప్పారు. ఉల్ఫా డిమాండ్లను దశల వారీగా తీరుస్తామని పేర్కొన్నారు. అఫ్సాలాంటి ప్రత్యేక చట్టాలను తొలగించామని వివరించారు. దీని ఉద్దేశం అసోంలో తిరుగుబాటు తగ్గినట్లే అవుతుందన్నారు.