తామెంత అధికార స్థాయిలో ఉన్నా.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నా సామాన్యులకు అందుబాటులో ఉంటూ.. వారి బాగోగులపట్ల శ్రద్ధ కనబరిచే రాజకీయ ప్రముఖులు చాలా అరుదు. అందులోనూ చిన్నారుల పట్ల పెద్ద మనసుతో ప్రేమాభిమానాలు పంచే పొలిటికల్ లీడర్లు ఎక్కడో నూటికో, కోటికో కనిపిస్తారు. అలాంటివారిలో త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఒకరు. ఈ నెల 5 న త్రిపురలో కుమార్ ఘాట్ నుంచి అగర్తల వెళ్లే రైల్లో ప్రయాణిస్తున్న చిన్నారి శ్రియాదితా దాస్ .. అదే రైల్లో వెళ్తున్న ఆయన కంటపడింది.
నాలుగో తరగతి చదువుతున్న ఆమెతో ఆయన మాటామాటా కలిపారు. మాటల మధ్యలో ఆమె బర్త్ డే ఆరోజే అని తెలుసుకున్న ఆయన.. ఆమెను మనఃస్ఫూర్తిగా అభినందించారు. తనతో ఎంతో ప్రేమగా మాట్లాడిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అని తెలియని శ్రియాదితా .. ఆ తరువాత ఆవిషయం తెలుసుకుని ఆశ్చర్యపోయింది. ఈ ప్రయాణంలో ఆమె అభిరుచులు, ఆమె ఆలోచనలు మాణిక్ సాహా తెలుసుకున్నారు.
వీరిద్దరి ముచ్చట్లు సోషల్ మీడియాకెక్కగా అంతా ఆశ్చర్యపోవడమే కాదు.. సాహాను ప్రశంసలతో ముంచెత్తారు. ఉన్నత స్థాయిలో ఉన్నా దానినేమాత్రం ఖాతరు చేయకుండా ఓ సామాన్యుడిలా మారిపోయి ఆ పాప పట్ల ఆయన కనబరిచిన అభిమానాన్ని నెటిజనులు పొగడకుండా ఉండలేకపోయారు.
చివరకు చిన్నారి శ్రియాదితా దాస్ కు సాహా నిన్న స్పెషల్ గిఫ్ట్ పంపుతూ ఆమెను సర్ప్రైజ్ చేశారు. సాధారణ పౌరులపై ఓ సీఎం ఎంతటి అభిమానాన్ని చూపుతారో, ఎంతటి కమిట్మెంట్ తో ఉంటారో ఈ అసాధారణ ఉదంతం తెలియజేస్తోందని అంటూ మీడియా సైతం అబ్బురంగా ఈ వీడియోను, ఈ వార్తను కవర్ చేసింది. తన ఫేస్ బుక్ లో సాహా .. ఈ పాపతో తనకు కలిగిన చక్కని అనుభవం గురించి ప్రస్తావిస్తూ ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.