రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో టీడీపీ(TDP)కార్యకర్తలు సై అంటే సై అనేలా ముందుకొచ్చి నిజాన్ని గెలిపించాలని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పిలుపునిచ్చారు. కడప జిల్లా కేంద్రంలోని 44వ వార్డులో కార్యకర్త కుటుంబాన్ని గురువారం ఆమె పరామర్శించారు. అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేయడానికి కృషి చేయాలన్నారు.
మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రచారానికి సిద్ధమైన కార్యకర్తలను అభినందించారు. రాష్ట్ర ప్రయోజనం కోసం చంద్రబాబు(Chandrababu) రాత్రింబవళ్లు ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసన్నారు. మరో ఐదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించేదన్నారు. వైసీపీ పాలనలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
సీఎం జగన్ పాలనలో ఏపీకి ఒక్క పరిశ్రమ రాకపోగా ఉన్న పరిశ్రమలను పక్కనున్న రాష్ట్రాలకు పంపించారని విమర్శించారు. వైసీపీ రాక్షస పాలనను తలపిస్తోందని భువనేశ్వరి మండిపడ్డారు. కార్యకర్తలను హత్య చేయడం, హింసించడం, ఇబ్బందులు పెట్టడం అలవాటుగా మారిందన్నారు. ప్రజలున్నారనే ధైర్యంతోనే ఇక్కడికి వచ్చానన్నారు.
అదేవిధంగా రాష్ట్రంలో గంజాయి, ఇసుక మాఫియా, భూకబ్జాలు, కల్తీ మద్యంలో ఏపీ ముందంజలో ఉండటం ఆందోళన కలిగించే విషయమన్నారు. వైసీపీ చేస్తున్న ప్రతీ తప్పిదాన్ని చంద్రబాబుపై నెట్టి చేతులు దులిపేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త పింఛన్ల వ్యవహారన్ని సైతం కుట్రపూరితంగా చంద్రబాబుకు ఆపాదించడం విడ్డూరంగా ఉందన్నారు.
వృద్ధులను మంచాలపై ఎండలో తీసుకెళ్లి వాళ్ల ప్రాణాలతో చెలగాటమాడారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధికోసం తపించిన చంద్రబాబు పేదవాళ్లకు పెన్షన్లను ఎలా అడ్డుకుంటారో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతుందన్నారు. ఎన్నికల్లో టీడీపీ జెండాను ఎగరేయడానికి కృషి చేయాలని భువనేశ్వరి పునరుద్ఘాటించారు.