ప్రతిపక్ష ఇండియా కూటమి (India Alliance)లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కూటమి నుంచి ఒక్కో పార్టీ నెమ్మదిగా దూరమవుతోంది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై ఏఐసీసీ (AICC)అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun kharge) స్పందించారు. కూటమిలో ఉన్న విభేదాలను తొలగించేందుకు కాంగ్రెస్ శాయశక్తులా కృషి చేస్తోందని వెల్లడించారు.
తాజాగా జేడీయూ కూడా కూటమికి వైదొలుగుతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై మీడియా అడిగి ప్రశ్నకు ఖర్గే బదులిస్తూ….. కూటమి నుంచి జేడీయూ వైదొలుగుతోందన్న విషయం గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. తాను నితీశ్ కుమార్‌కు లేఖ రాశానని, ఫోన్ కూడా చేశానన్నారు.
నితీశ్ మనసులో ఏముందో తనకు తెలియదని చెప్పారు. తాను రేపు ఢిల్లీకి వెళతానని, ఆ విషయం గురించి పూర్తి సమాచారం తెలుసుకుంటానని వివరించారు. చూద్దాం… ఏం జరుగుతుందోనని అన్నారు. ఇండియా కూటమిలో “అందరినీ ఏకం” చేసేందుకు కాంగ్రెస్ తన శాయశక్తులా ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.
టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో తాను మాట్లాడానన్నారు. మనమంతా ఐక్యంగా ఉండాలని అప్పుడే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మంచి పోరాటం చేయగలమని వారితో చెప్పానని తెలిపారు. ఇండియా కూటమి బాగా పనిచేయాలని, ప్రజాస్వామ్యం రక్షించబడాలని కోరుకునే వారు తొందరపాటు నిర్ణయం తీసుకోరని కాంగ్రెస్ చీఫ్ అన్నారు.