తెలంగాణ (Telangana) ప్రభత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) వల్ల పలు ఇబ్బందులు కలుగుతోన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే బస్సుల్లో మగవారు ప్రయాణించడానికి సాహసం చేయవలసి వస్తుండగా.. ఆటోడ్రైవర్లు సైతం తమ పొట్టగొడుతోన్న పథకం పై గుర్రుగా ఉన్నారు.. అంతే కాకుండా ఈ పథకం వల్ల ఆర్టీసీ సిబ్బందికి కూడా కష్టాలు ఎదురవుతున్నాయని పలు సంఘటనలు నిరూపిస్తోన్నాయి.
ఇప్పటికే కొత్తగూడెం (Kothagudem) ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై, ఆటో డ్రైవర్లు దాడి చేయడం, భద్రాచలం (Bhadrachalam)లో మహిళా కండక్టర్ ను ప్రయాణికులు దూషించిన సంఘటనలు చోటు చేసుకొన్నాయి. అయితే ఈ ఘటనలపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. టీఎస్ ఆర్టీసీ కి సిబ్బంది వెన్నుముక. వారు నిత్యం నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజు లక్షలాది ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారుని సజ్జనార్ వివరించారు..
సిబ్బంది కృషి వల్లనే ఆర్టీసీ సంస్థ మనగలుగుతోంది. మహాలక్ష్మి స్కీమ్ అమలులో సైతం కీలకపాత్ర పోషిస్తున్నారు. సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లైనా సిబ్బందిని కొందరు దూషించడం, దాడులు చేయడం సరికాదని సజ్జనార్ హెచ్చరించారు. ఇలాంటి ఘటనలకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని సజ్జనార్ తెలిపారు..
సిబ్బంది పై దాడులు జరిగిన క్రమంలో అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారని తెలిపిన టీఎస్ ఆర్టీసీ ఎండీ.. పోలీసులు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి.. విచారణ చేపట్టినట్టు పేర్కొన్నారు. మరోవైపు కొత్తగూడెం నుంచి మధ్యాహ్నం ఖమ్మం బయల్దేరిన పల్లెవెలుగు బస్సు పట్టణంలోని పోస్టాఫీస్ కూడలికి చేరుకుంది. అయితే అప్పటిదాకా బస్ కోసం వెయిట్ చేసిన ప్రయాణికులు, మహిళలు ఆటోల్లో వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ఇంతలో బస్ రావడంతో ఆటో దిగి బస్సు ఎక్కేశారు. అసలే గిరాకీలు లేని ఆటో డ్రైవర్లు తీవ్ర ఆగ్రహానికి లోనై, బస్సు డ్రైవర్ నాగరాజుపై దాడి చేశారు. ఈ ఘటనపై డ్రైవర్ నాగరాజు, కొత్తగూడెం డిపో మేనేజర్ బాణాల వెంకటేశ్వరరావుతో కలిసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైట్ చేయడం సజ్జనార్ దృష్టికి వెళ్ళింది.. దీంతో ఆయన వార్నింగ్ ఇచ్చారు..