– గ్రూప్-2 పరీక్షకు కొత్త డేట్స్
– నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహణ
– టీఎస్పీఎస్సీ ప్రకటన
గ్రూప్ -2 పరీక్షల విషయంలో టీఎస్పీఎస్సీ కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు నవంబరు 2, 3 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గం.ల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
గ్రూప్ -2 స్థాయి కొలువు ఎంతోమంది విద్యార్థుల కల. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ గురించి ఇప్పటి దాకా కళ్లుకాయలు కాచేలా ఎదురు చూశారు. 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం అన్ని పోటీ పరీక్షలకూ ఒక్కసారిగా గేట్లు ఎత్తేసింది. ఈనెల 29, 30 తేదీల్లో గ్రూప్ -2 పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. గురుకుల పరీక్షలు కూడా ఉండడం ఉద్యోగార్థులకు ఆందోళన కలిగించింది. దీంతో గ్రూప్ -2 పరీక్షలు వాయిదా కోసం అభ్యర్థులు, విపక్ష నేతలు ఇటీవల ఆందోళనలు చేపట్టారు.
విద్యార్థుల నుంచి వస్తున్న వ్యతిరేకతను ప్రభుత్వం పరిగణనలోనికి తీసుకుంది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్-2 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని సీఎస్ ను సీఎం కేసీఆర్ ను సూచించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి. అంతేకాదు లక్షలాది మంది అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా ఇకపై జాగ్రత్తలు తీసుకొనే నిర్ణయాలు తీసుకోవాలన్నారు.
భవిష్యత్తులో కూడా నియామక ప్రకటనల జారీలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సూచించినట్లు కేటీఆర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షలను నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది.