ఉగాది(Ugadi) పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. ఏపీలోని తిరుమలలో (Thirumala) శ్రీక్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని(Ugadi asthanam) టీటీడీ(TTD) మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించింది. ఉత్సవమూర్తులకు అర్చకులు పట్టు వస్త్రాలు సమర్పించారు. తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించాక శుద్ధి నిర్వహించారు.
ఉదయం ఆరు గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులకు అర్చకులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద పండితులు పంచాగ శ్రవణం చేశారు. శ్రీవారి ఆలయంలో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు సాలకట్ల వసంతోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఇవాళ రద్దు చేసిన ఆర్జిత సేవలు బుధవారం నుంచి పునరుద్ధరిస్తున్నారు.
తెలంగాణలోని భద్రాచలం జిల్లాలోని శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల నేడు(మంగళవారం) నుంచి ప్రారంభమయ్యాయి. ఉగాది పండుగ క్రోది నామ సంవత్సరం పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ చేశారు. నేటి నుంచి ఈనెల 23 వరకు జరుగనున్నాయి. దీంతో ఆలయ పరిసరాలు మొత్తం భక్తుల రాకతో సందడిగా మారాయి.
ఈ వేడుకల్లో భాగంగా శ్రీరాముని పట్టాభిషేకం వేడుకలు జరగనున్నాయి. టిక్కెట్లు ఆన్‌లైన్, టికెట్ కౌంటర్లలో కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా వరంగల్ భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు వివిధ రకాల పూలతో పుష్పార్చన చేయనున్నారు. వేడుకల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు. అమ్మవారి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.