తెలంగాణ (Telangana) రాజకీయాలలో ఘాటు విమర్శలు కామన్ అయినా.. ఈ ఎన్నికల సమయంలో అవి హద్దు మీరాయని అనుకుంటున్నారు. నోటితో వచ్చే మాట చిన్నదైన అది సృష్టించే ప్రకంపనాలు ఎక్కడి వరకైనా వెల్లవచ్చని తెలిసిందే. అయితే తాజాగా కమలంలో కలకలం చెలరేగింది. రాజన్న సిరిసిల్ల (Rajanna Sirisilla)జిల్లా, వేములవాడ (Vemulawada) టికెట్ ఆశించిన మహిళ నాయకురాలు తుల ఉమ కాషాయం పై కస్సు బుస్సులాడారు..
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections)పోటీ చేయాలని ఆశించిన తుల ఉమ చివరి వరకు బీఫామ్ వస్తుందనే ఆశతో ఉన్నారు. కానీ కమలంలో జరిగిన రాజకీయ వ్యూహంలో.. తుల ఉమను బలిపశువు చేశారని ఆరోపణలు వస్తున్నాయి.. వేములవాడ అభ్యర్థి విషయంలో యూ టర్న్ తీసుకున్న బీజేపీ (BJP) అధిష్టానం తుల ఉమకు బదులు వికాస్ రావుకు బీఫాం ఇచ్చింది.
అయితే చివరి క్షణంలో బీఫామ్ రాకపోవడంతో వేములవాడకు చెందిన తుల ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు. బీజెపీ నాయకులు ఫోన్ చేస్తే చెప్పుతో కొడుతా అని తుల ఉమ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. అగ్రవర్గాల వారికి కొమ్ము కాసే బీజేపీ.. బీసీలను అణగదొక్కాలని చూస్తున్నారని ఉమ ఆరోపించారు.
బీజేపీలో మహిళకు స్థానం లేదని తుల ఉమ విమర్శించారు. బీజేపీలో బీసీని సీఎం చేస్తామనేది ఓ బూటకమని అన్నారు. ఓట్ల కోసం బీజేపీ నాటకాలు వేస్తుందని విమర్శించారు.. కాగా త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించిన తుల ఉమ.. ఏ పార్టీ అనేది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.