‘నా నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత అరాచకం చూడలేదు’ అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రవాణాశాఖ మంత్రి, ఖమ్మం బీఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ ఖమ్మంలోని నెహ్రూనగర్‌లో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ‘గోదావరి జలాలతో పాలేరు ప్రజల కాళ్లు కడుగుతానన్న పెద్దమనిషి ఖమ్మం ఎందుకు వచ్చారు?’ అంటూ మాజీ మంత్రి తుమ్మలను ఉద్ధేశిస్తూ ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై తుమ్మల నాగేశ్వరరావు తాజాగా స్పందించారు.
గురువారం 8వ డివిజన్‌లో నిర్వహించిన ఇంటింటికీ కాంగ్రెస్ కార్యక్రమంలో తుమ్మల మాట్లాడుతూ.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని పోలీసులను ప్రైవేట్ సైన్యంగా మార్చారన్నారు. బెదిరింపులు దౌర్జన్యంతో కాంగ్రెస్ నేతలను భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో అరాచక పాలన తరమి కొట్టడానికి కాంగ్రెస్ శ్రేణులు కథం తొక్కాలని పిలుపునిచ్చారు.
దేశంలో మత విద్వేషాలు లేకుండా భారత్ జొడో యాత్రతో యావత్ దేశాన్ని ఐక్యం చేసిన రాహుల్ గాంధీ ఆహ్వానంతో కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు. నియంత రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు. కొంత మంది పోలీస్ అధికారులు పరిధి దాటి కాంగ్రెస్ నేతల్ని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.
నెల రోజులు తరువాత అధికారం లేని వారి కోసం అధికారులు తమ జీవితాలు నాశనం చేసుకోవొద్దని సూచించారు. పోలీస్ అధికారులు తమ పద్దతి మార్చుకోకపోతే ప్రజా తిరుగుబాటు చూస్తారని హెచ్చరించారు. అహంకార పాలనకు పాతరేసి ఖమ్మం అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తుమ్మల నాగేశ్వరరావు కోరారు.