తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుపై కేంద్రానికి కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం లేఖ రాసింది. రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు విషయాన్ని గుర్తు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi)కి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( లేఖ రాశారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని లేఖలో మంత్రి కోరారు.
పసుపు బోర్డు ఏర్పాటుపై గత ఏడాది అక్టోబర్ 4న హామీ ఇచ్చారని లేఖలో గుర్తు చేశారు. ఈ మేరకు పసుపు బోర్డు ఏర్పాటు పనులను ప్రారంభించాలని కోరారు. రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు అనేది రైతుల చిరకాల వాంఛ అని వెల్లడించారు. గతంలో నిజామాబాద్లో ఎంపీ స్థానానికి రైతులు నామినేషన్లు వేసి మరీ నిరసనలు తెలిపారని లేఖలో వెల్లడించారు.
పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో కేంద్రం ఇప్పటికే గెజిట్ను విడుదల చేసిందని అన్నారు. కానీ పసుపు బోర్డును ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి యేటా సాగు విస్తీర్ణం పెరిగిపోతోందని..అందువల్ల పసుపు బోర్డు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గతంలో తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ… పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బోర్డు ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్లో ఆమోదం తెలిపారు. ఆ తర్వాత పాలమూరులో జరిగిన బీజేపీ జనగర్జన సభలో కూడా ప్రధాని మోడీ మరోసారి పసుపు బోర్డు ఏర్పాటు గురించి హామీ ఇచ్చారు.