తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Election) కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తుందని అంతా భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తుందని ఆశిస్తున్నారు.. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన జాతీయ స్థాయి అగ్రనేతలు వరుసగా ప్రచార పర్వంలో జోరు చూపిస్తున్నారు. కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు..
ఇక తెలంగాణలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గే, అగ్ర నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారం నిర్వహించి పార్టీ పై మరింత నమ్మకాన్ని పెంచారు.. ఇలా రాష్ట్రంలో జీరో స్థాయి నుంచి బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ అవతరించింది. అంతా సవ్యంగా జరుగుతుంది అని భావిస్తున్న సమయంలో ఇన్నాళ్ళూ ఉన్న అపవాదును నిజం చేస్తూ.. కాంగ్రెస్ (Congress) నేతలు కొట్టుకున్న వీడియో వైరల్ గా మారింది.
తుంగతుర్తి (Tungaturthi)లో కాంగ్రెస్ అభ్యర్థి మందుల శామ్యూల్ శుక్రవారం చౌళ్ల రామారం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో యువజన నాయకుడు ఖమ్మంపాటి కుమార్ గౌడ్‌ను.. గ్రామ కాంగ్రెస్ నాయకులు ప్రచార రథం నుండి మెడలు పట్టి కిందకు నెట్టేశారు. దీంతో కుమార్ గౌడ్ స్పృహ కోల్పోయాడు. ఈ పరిణామంతో ఇద్దరి అనూచరుల మధ్య గొడవ మొదలైంది. మాటకు మాట పెరగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
కాగా ఇప్పటి వరకు అధికార బీఆర్ఎస్ (BRS)కు ధీటుగా ప్రచారం నిర్వహించడంలో, జనాల్లోకి వెళ్లడంతో కాంగ్రెస్ అభ్యర్థులు సక్సెస్ అవుతున్నారనే టాక్ ఉంది.. అయితే, ఈ క్రమంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతుందనే ఆలోచన లేకుండా కాంగ్రెస్ నేతలు ఇలా ప్రవర్తించడం అధిష్టానానికి తలనొప్పి తెస్తుందని అనుకుంటున్నారు..