తమ డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు (farmers union) ఈ నెల 13న ‘ఢిల్లీ ఛలో’ (Delhi Chalo)పేరిట పాదయాత్ర చేపట్టేందుకు రెడీ అవుతున్నాయి. మొత్తం 200 రైతు సంఘాలు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో పోలీసులను ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్ చేశాయి. సుమారు 20,000 మంది రైతులు 2000 ట్రాక్టర్లపై ప్రయాణించి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నట్టు హెచ్చరించాయి.
తమ సమస్యల గురించి కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లేందుకు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, కేరళ, కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో రైతులు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ క్రమంలో ఈ పాదయాత్రలో సంఘ విద్రోహశక్తులు ఎంటర్ అయ్యే అవకాశం ఉందని, నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని తెలిపాయి. ముఖ్యంగా ప్రధాని మోడీ నివాసాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించే అవకాశం ఉందని హెచ్చరించాయి.
అందువల్ల పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేయాలని సూచించాయి. కార్లు, ద్విచక్ర వాహనాలు, మెట్రో లేదా బస్సులను ఉపయోగించి రైతులు ఢిల్లీలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు తెలిపాయి. ఇక ‘ఢిల్లీ ఛలో’ సందర్బంగా టిక్రీ సరిహద్దుల వద్ద భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఢిల్లీలోని సింఘు సరిహద్దుల్లో పెద్ద కంటైనర్లు, సిమెంటు, ఇనుప బారికేడ్లు, వాటర్ క్యానన్లను పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు.
ఇది ఇలా వుంటే రైతులతో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద రాయ్ భేటీ కానున్నారు. చత్తీస్ గఢ్లో రైతు సంఘాల నేతలు జగజిత్ సింగ్ దలేవాల్, సర్వన్ సింగ్ పందేర్లతో కేంద్ర మంత్రులు చర్చలు జరపనున్నారు. 26 జనవరి 2021న ఢిల్లీలో రైతులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఢిల్లీలో మరోసారి అలాంటి పరిస్థితులు తలెత్తకూడదని అటు పోలీసులు… ఇటు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.