అనుకోని పరిస్థితుల కారణంగా పుట్టినప్పుడే విడిపోయిన ఇద్దరు కవలలు ఆశ్చర్యకరంగా 19 ఏళ్ల తర్వాత కలిశారు. పక్కవీధిలో ఉంటున్నా ఒకరినొకరు ఎన్నడూ తారసపడలేదు. అయితే తాజాగా ఓ టిక్‌టాక్(Tiktok) వీడియో, టీవీ షో వారిద్దరిని కలిపాయి. 1972లో బాలీవుడ్‌లో విడుదలైన ‘సీత ఔర్ గీత’(Sita Aur Geeta) అనే సినిమా వీరి జీవితానికి చాలా దగ్గరగా ఉందనే చెప్పాలి.
అచ్చం ఒకేలా ఉండే ఈ కవలల పేర్లు అమీ క్విటియా(Amy Quitia), అనో సర్టానియా (Ano Sartania). గోచా గఖారియా, అజా షోని దంపతులకు 2002లో జన్మించారు. అయితే అజా షోని ఇద్దరు కవలలకు జన్మనిచ్చే సమయంలో తీవ్ర అనారోగ్యకర పరిస్థితుల నడుమ కోమాలోకి వెళ్లిపోయింది. దాంతో, తన కవల బిడ్డలను గోచా రెండు వేర్వేరు కుటుంబాలకు అమ్మేశాడు.
కట్ చేస్తే.. అనో సర్తానియా తిబ్లిసి ప్రాంతంలో పెరగ్గా, అమీ క్విటియా జుగ్దిది ప్రాంతంలో పెరిగింది. అయితే, ఇన్నాళ్లు తాము కవలలం అని, చెరొక చోట పెరుగుతున్నామని వారిద్దరికీ ఏమాత్రం తెలియదు. 11ఏళ్ల వయసున్నప్పుడు ఇద్దరూ ఓ డ్యాన్స్ కాంటెస్ట్‌లో పాల్గొన్నారు. అక్కడ వీరిద్దరిని చూసినవారు ఇద్దరూ అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నారే అని విస్మయానికి గురయ్యారు.
ఆ తర్వాత జార్జియా గాట్ టాలెంట్ అనే టీవీ కార్యక్రమంలో అచ్చం తనలానే ఉన్న అమ్మాయి (అనో)ని చూసి అమీ దిగ్భ్రాంతికి గురైంది. దాంతో అనో గురించి తెలుసుకోవాలన్న తపన ఆమెలో మొదలైంది. అటు, అనో సోషల్ మీడియాలో ఓ టిక్ టాక్ వీడియో చూసి ఆశ్చర్యానికి గురైంది. అచ్చం తనలాగే ఉన్న అమ్మాయి (అమీ) ఆడిపాడుతోంది.
ఆ తర్వాత అనేక ప్రయత్నాల మీదట ఈ కవలలు తమ 19వ ఏట ఒకరినొకరు కలుసుకుని తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. జార్జియాలోని ఆసుపత్రుల్లో వేలాది మంది శిశువులు మాయం కావడం, పేదరికం కారణంగా పుట్టిన బిడ్డలను పురిట్లోనే అమ్ముకోవడం సాధారణమైన విషయం. ఇలాంటి వేలాది శిశువులపై బీబీసీ చానల్ తాజాగా ప్రత్యేక కార్యక్రమం కూడా రూపొందించింది. అందులోనే అమీ, అనోల గాథను కూడా చూపించడంతో అందరికీ వీళ్ల గురించి తెలిసింది.