మణిపూర్ (Manipur)లో హింస ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. తాజాగా మణిపూర్లో మరోసారి హింస చెలరేగింది. కాంగ్ పోక్సీ జిల్లాలో దుండగులు కాల్పులకు దిగారు. ఈ కాల్లుల్లో ఐఆర్బీ జవాన్ (IRB Jawan)తో పాటు మరో వ్యక్తి కూడా మరణించారు. దీంతో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హరోథెలా, కోబ్షా గ్రామాల మధ్య సోమవారం ఘర్షణ చెలరేగింది.
ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న ఇండియన్ రిజర్వ్ బెటాయన్ అక్కడికి బయలు దేరింది. ఐఆర్బీ సిబ్బంది ప్రయాణిస్తున్న మారుతీ జిప్సీపై దుండగులు దాడి చేశారు. ఈ కాల్పుల్లో జవాన్ హెన్మిన్లెన్ వైఫే, డ్రైవర్ తంగ్మిన్లున్ హాంగ్సింగ్ కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారని అధికారులు తెలిపారు.
కాల్పులకు గల కారణాలు తెలియరాలేదని వెల్లడించారు. ఘటననను కమ్యూనిటీ ఆన్ ట్రైబల్ యూనిటీ(సీఓటీయూ) ఖండించింది. రాష్ట్రంలో 48 గంటల బంద్ కు సీఓటీయూ పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించింది. గిరిజనులకు సహాయం కూడా చేయడం లేదని మండిపడింది. మెయిథీల నియంత్రిత ప్రభుత్వంలో జీవించకుండా ఉండే రాజకీయ పరిష్కారాన్ని తమకు అందించాలని డిమాండ్ చేసింది.
ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు. నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. ఇది ఇలా వుంటే మణిపూర్లో రిజర్వేషన్ల అంశం మెయిటీ, కుకీ కమ్మూనిటీల మధ్య చిచ్చు పెట్టింది. దీంతో ఈ ఏడాది మే 3న రెండు గిరిజన తెగల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. వివాదం హింసాత్మకంగా మారడంతో ఇప్పటికవరకు సుమారు 200 మంది చనిపోయారు.