డిగ్రీ మార్కుల మెమో, ప్రొవిజనల్ సర్టిఫికెట్లపై ఆధార్ నంబరు ముద్రించే విషయంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్హత ధ్రువపత్రాలపై ఆధార్ ముద్రణ నిలిపివేస్తున్నట్టు యూజీసీ పేర్కొంది. ఈ మేరకు ఉన్నత విద్యాసంస్థలన్నీ UIDAI నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. సర్టిఫికెట్లపై ఆధార్ నెంబర్లు ముద్రణ వ్యక్తిగత గోపత్య ఉల్లంఘనగానే భావిస్తున్నారు.
ఆధార్ నెంబర్లు వల్ల వ్యక్తిగత వివరాలు బయటకు వెళ్లే అవకాశముందన్న ఆందోళనలను యూజీసీ పరిగణలోకి తీసుకుంది. రిక్రూట్మెంట్ లేదా ప్రవేశాల సమయంలో ధ్రువపత్రాల పరిశీలన కోసం విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలు జారీ చేసే ప్రొవిజనల్ సర్టిఫికెట్లు, డిగ్రీ మార్కుల మెమోలపై ఆధార్ నంబర్లను ముద్రించే అంశాన్ని పలు రాష్ట్రాలు పరిశీలిస్తున్న వేళ యూజీసీ ఈ ఆదేశాలను జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
‘నిబంధనల ప్రకారం ఆధార్ నెంబర్ను కలిగి ఉన్న సంస్థ ఏదైనా డేటాబేస్ లేదా రికార్డ్ల ద్వారా బహిర్గతం చేయకూడదు.. డిగ్రీలు, ప్రొవిజినల్ సర్టిఫికెట్లపై ఆధార్ నెంబర్లు ముద్రణకు అనుమతిలేదు.. ఉన్నత విద్యాసంస్థలన్నీ UIDAI నిబంధనలను కచ్చితంగా పాటించాలని’ అని పేర్కొంటూ దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలకు యూజీసీ సెక్రెటరీ మనీశ్ జోషి లేఖ రాశారు.
ప్రతి భారత పౌరుడికి విశిష్ట గుర్తింపు సంఖ్య (ఆధార్ కార్డు) ఉండాలనే నిబంధనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించాయి. పలు సంక్షేమ పథకాల మంజూరు, భూముల రిజిస్ట్రేషన్, ఉపాధి హామీ పనుల కల్పన, బ్యాంక్ పాస్బుక్, భూముల క్రయవిక్రయాలు, విద్యార్థుల చదువులు, పంటల విక్రయాలు, స్కాలర్ షిప్స్ వంటివాటికి కూడా ఆధార్ తప్పనిసరిగా మారింది. ఆధార్ కార్డును పదేళ్లకోసారి పునరుద్ధరించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. అడ్రస్ స్థానికతను నిర్ధరించుకుంటూ నమోదు చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.