యూకే(UK)ను ఆర్థిక మాంద్యం చుట్టు ముట్టింది. 2023 నాలుగో త్రైమాసికంలో జీడీపీ(GDP) 0.3శాతం క్షీణించింది. దీంతో బ్రిటన్ మెల్లగా మాంద్యంలోకి జారుకుంటోంది. భవిష్యత్తులోనూ ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉండటంతో యూకేలో ఉంటున్న భారతీయుల్లో అభద్రతాభావం నెలకొంది.
ప్రపంచస్థాయి విద్య, ఉద్యోగం పొందడంలో సాయం చేస్తామంటూ విద్యార్థులను ఆకర్షించిన యూకే ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు, ఇప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో మాట తప్పయనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే విద్యార్థులకు అక్కడ కష్టకాలంగానే కనిపిస్తోంది.
జీవన వ్యయం పెరిగిపోతుండటంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. భారతీయ విద్యార్థులు ఇప్పుడు అక్కడ ఉద్యోగ ప్రణాళికలను విరమించుకుని తిరిగి భారత్‌కు వచ్చే యోచనలో ఉన్నారు. కొందరు ఉద్యోగం రాకుండానే పోస్టు స్టడీ వర్క్ వీసా అయిపోతుందని భయపడుతున్నారు.
జాబ్ మార్కెట్ పరిస్థితి ఆర్థిక మాంద్యంతో మరింత దిగజారిపోయింది. ఈ తరుణంలో పెరుగుతున్న జీవన వ్యయంతో పాటు పని ఒత్తిడి కారణంగా ఉద్యోగం పొందిన కొంత మంది విద్యార్థులు కూడా స్పాన్సర్షిప్ ద్వారా వీసా పొడిగించుకునేందుకు ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది.