తెలంగాణ (Telangana) భవిష్యత్‌ను దోచుకున్న కేసీఆర్ (KCR) ఒక ‘కమీషన్ మాఫియా రాజ్’అని ఏఐసీసీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా (Randeep Surjewala) మండిపడ్డారు. బీఆర్ఎస్ అంటే బేరోజ్ గారో కో రులావో సమితి అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణను దేశానికే సూసైడ్ క్యాపిటల్‌గా మార్చారంటూ నిప్పులు చెరిగారు.
గత పదేండ్లలో అనేక అబద్దపు వాగ్దానాలతో తెలంగాణ యువత ఆకాంక్షలను కేసీఆర్ సర్కార్ అణచి వేసిందన్నారు. బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యం కారణంగానే ఉద్యోగాలు రాక చాలా మంది యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మరణాలన్నింటికి కల్వకుంట్ల కుటుంబ పాలనే కారణమని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో 20వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కానీ గడిచిన తొమ్మిదేండ్లలో ఒక్క రెగ్యులర్ టీచర్‌ను కూడా నియమించ లేదన్నారు. పేపర్ లీక్ విచారణ ఆలస్యం కావడంతో టీఎస్ పీఎస్సీ బోర్డుపై అభ్యర్థులకు నమ్మకం లేకుండా పోయిందన్నారు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి యువతను కేసీఆర్ మోసం చేశారని అన్నారు. బీఆర్ఎస్ అవినీతి మాఫియా తరహా కమీషన్ పాలనతో ప్రజలు, యువకులు పూర్తిగా విసుగు చెందారన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వస్తే యువత కోసం బంగారు తెలంగాణకు నాంది పలుకుతామని హామీ ఇచ్చారు. ప్రతి ఏడాది జాబ్ కేలండర్‌ను ప్రకటించి అన్ని ఖాళీలను సకాలంలో భర్తీ చేస్తామన్నారు.. గ్రామీణ యువత ఉపాధి కల్పించే అనే స్కీమ్ లకు శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. యువ వికాసం కింద విద్యార్థులకు 15 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే పూర్తి చేస్తామన్నారు.