షహీద్ వైకుంఠ శుక్లా (Shaheed Baikunta Shukla)….మొదట సహాయ నిరాకణ (Civil Disobedience Movement) లాంటి ఉద్యమాల్లో పాల్గొన్నారు. శాంతి యుత ఉద్యమాలతో భారత్ కు స్వాతంత్ర్యం రాదని గ్రహించి విప్లవ బాట పట్టారు. హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ లో చేరి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. చివరకు ఉరిశిక్ష సమయంలో మృత్యువు కండ్లలోకి కళ్లు పెట్టి ధైర్యంగా చూసిన గొప్ప ధైర్యశాలి.
15 మే 1907న బెంగాల్ ముజఫర్ పూర్లో జాలాపూర్లో వైకుంఠ శుక్లా జన్మించారు. విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న అనంతరం ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. 1930లో మొదటి సారిగా సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పుడే తొలిసారిగా అరెస్టయ్యారు. గాంధీ- ఇర్విన్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు రాజకీయ ఖైదీలను వదిలి పెట్టారు. ఈ క్రమంలోనే శుక్లా జైలు నుంచి విడుదలయ్యారు.
ఆ తర్వాత సహాయనిరాకరణ ఉద్యమం ఆగిపోవడం, పరిస్థితులు అన్నీ మారిపోవడంతో ఆయన కలత చెందారు. శాంతియుత మార్గాల్లో భారత్ కు స్వాతంత్ర్యం రావడం కష్టమేనని భావించారు. అందుకే విప్లవ బాటలో ప్రయాణించాలనుకున్నారు. హెచ్ఎస్ఆర్ఏలో సభ్యుడిగా చేరారు. సంస్థ తరఫున విప్లవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని త్వరలోనే కీలక సభ్యుడిగా మారారు.
అలాంటి సమయంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లతో పాటు పలువురు హెచ్ఎస్ఆర్ఏ సభ్యులు అరెస్టయ్యారు. వారిలో ఫణింద్రనాథ్ ఘోష్ అనే వ్యక్తికి డబ్బు ఆశ జూపి అప్రూవర్ గా మార్చేందుకు బ్రిటీష్ వారు ప్రయత్నించారు. అదే జరిగితే ఆ కేసులో అరెస్టైన విప్లవకారులందరికీ కఠిన శిక్షలు తప్పవని హెచ్ఎస్ఆర్ఏ సభ్యులు ఆందోళన చెందారు. ఎలాగైనా ఫణింద్రనాథ్ ను హతమార్చాలని నిర్ణయానికి వచ్చారు.
ఆ బాధ్యతను తన భుజాన వేసుకుని ఫణింద్రను హత్య చేసేందుకు శుక్లా బయలుదేరాడు. చాలా ప్రాంతాల్లో గాలించి చివరకు ఫణింద్ర ఆచూకీ తెలుసుకుని అతన్ని హత మార్చాడు. ఆ తర్వాత 5 జనవరి 1833న శుక్లాను బ్రిటీష్ పోలీసులు అరెస్టు చేశారు. 14 మే 1934న ఉరిశిక్ష విధించారు. ఉరిశిక్ష సమయంలో నిందితుడి తలపై నల్లటి గుడ్డ కప్పటం ఆనవాయితీ. కాను తనపై ఎలాంటి వస్త్రాలు కప్పవద్దని, తాను మృత్యవును ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నానని చెప్పి ఉరి కంబం ఎక్కాడు.