భారత్ (Bharat), పాక్ (Pakistan) మధ్య నెలకొన్న వివాదాల్లో మొదటిది జమ్మూకాశ్మీర్. ఇప్పటికే చాలా ప్రాంతాన్ని ఆక్రమించుకుంది దాయాది దేశం. వివాదాస్పదమైన ఆ ఏరియాని పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) గా పిలుస్తుంటారు. అక్కడ మకాం వేసిన ఉగ్ర మూకలు భారత్ లో అలజడులు సృష్టించేందుకు ప్లాన్ చేస్తుంటాయి. అయితే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ పై తాజాగా కేంద్రమంత్రి వీకే సింగ్ (VK Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు.
త్వరలోనే పీవోకే (POK) భారత్ లో కలిసిపోతుందని అన్నారు కేంద్రమంత్రి. రాజస్థాన్లోని దౌసాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతాన్ని భారత్ లో విలీనం చేయాలంటూ ప్రజలు చేస్తున్న డిమాండ్లపై మీడియా కేంద్రమంత్రిని ప్రశ్నించింది. ఇందుకు ఆయన సమాధానిమిస్తూ.. పాక్ ఆక్రమిత కశ్మీర్ తనంతట తానే భారత్ లో విలీనమవుతుందన్నారు. అయితే.. అందుకు కొంత సమయం పట్టొచ్చని తెలిపారు.
యుద్ధం అనేది ఏ దేశ ఆర్థిక వ్యవస్థని అయినా తక్కువలో తక్కువ 20 ఏళ్లు వెనక్కి నెడుతుందని అన్నారు వీకే సింగ్. అందువల్ల యుద్ధం చేయాలనుకునే ముందు ఆలోచించాలని.. దాని ద్వారా మనం ఏం చేయాలి? ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు వస్తాయి అనేది చూసుకోవాలని వ్యాఖ్యానించారు. యుద్ధం చివరి ఉపాయం మాత్రమేనని.. పీవోకే ఎప్పటికైనా భారత్ లో కలుస్తుందని అన్నారు.
భారతదేశంలో కలుస్తామంటూ ఇటీవల పీవోకే ప్రజలు భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి వీకే సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.