భారత్ అంతర్గత వ్యవహారాలపై ఇటీవల అమెరికా(USA) అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జర్మనీ, అమెరికా వంటి దేశాలు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) అరెస్ట్‌పై స్పందిచిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి రియాక్ట్ అయింది.
కేజ్రీవాల్ అరెస్ట్‌తో పాటు లోక్ సభ ఎన్నికలకు ముందు ఐటీ విభాగం కాంగ్రెస్ పార్టీ ఖాతాలను ఫ్రీజ్ చేయడం వంటి అంశాలపై స్పందించింది. ఎన్నికల ముందు విపక్ష ఢిల్లీ సీఎం అరెస్ట్, ప్రతిపక్ష పార్టీ ఖాతాల స్తంభనతో నెలకొన్న రాజకీయ అనిశ్చిత్తిపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ స్పందించారు.
‘‘భారత్‌తో పాటు ఎన్నికలు జరిగే ప్రతీ దేశంలోనూ రాజకీయ, పౌర హక్కులు రక్షించబడతాయని ఆశిస్తున్నాం. స్వేచ్ఛ, న్యాయమైన వాతావరణంలో ప్రతీఒక్కరు ఓటు వేస్తారని నమ్ముతున్నాం.’’ అని స్టెఫాన్ డుజారిక్ పేర్కొన్నారు.
మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అకౌంట్ల స్తంభనపై అమెరికా రెండుసార్లు స్పందించగా భారత్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసేందే. అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. ఇతర దేశాల జోక్యాన్ని ఏమాత్రం ఆమోదించమని తేల్చిచెప్పింది. ఈ అంశాలు పూర్తిగా తమ దేశ అంతర్గత వ్యవహరం అని స్పష్టం చేసింది. తమ దేశ సార్వభౌమత్వాన్ని ప్రతి ఒక్క దేశం గౌరవించాలని ఇండియా పేర్కొంది.