పాలస్తీనా శరణార్థుల(Palestinian Refugees) కోసం పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ(UNRWA)పై ఇజ్రాయెల్ తీవ్ర ఆరోపణలు చేసింది. హమాస్ దాడిలో ఉద్యోగుల పాత్ర ఉందని, దీంతో యుద్ధం అనంతరం ఏజెన్సీ కార్యకలాపాలు నిలిపివేయాలని కోరతామని ఇజ్రాయెల్ చెబుతోంది. దీంతో ఇక ఏజెన్సీకి అమెరికా సాయంగా అందజేసే నిధులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
మరోవైపు ఆస్ట్రేలియా, కెనడా దేశాలు కూడా యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏకి నిధులను నిలిపివేశాయి. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగంపై హమాస్ జరిపిన దాడిలో యూఎన్‌ఆర్‌డబ్ల్యూ ఏజెన్సీకి చెందిన కొందరు ఉద్యోగుల పాత్ర ఉందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయని ఆ ఏజెన్సీ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది.
ఈ విషయంపై యూఎన్ఆర్డబ్ల్యూఏ కమిషనర్ జనరల్ ఫిలిప్ లజారిని స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మందిని ఉద్యోగులను తొలగించామని వెల్లడించారు. అదేవిధంగా ఇజ్రాయెల్ సమాచారం ఆధారంగా దీనిపై తక్షణమే దర్యాప్తు నిర్వహిస్తామని తెలిపారు. మానవతా సాయం అందించే యూఎన్ ఏజెన్సీని రక్షించే నేపథ్యంలో ఈ నిర్ణయం తెలిపారు.
అయితే, యుద్ధం అనంతరం గాజాలో ఆ ఏజెన్సీ కార్యకలాపాలను నిలిపేయాలని కోరతామని ఇజ్రాయెల్ విదేశాంగశాఖ మంత్రి కాట్జ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. అవసరమైతే అమెరికా, యూరోపియన్ యూనియన్ మద్దతు కూడా తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంపై హమాస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. పాలస్తీనియన్ల రక్షణ కోసం పనిచేస్తున్న ఏజెన్సీలను భయపెట్టాలని ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని విమర్శించింది.
గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి ఘటనలో సుమారు 1200మంది మృతిచెందారు. 250 మందిని హమాస్ బందీలుగా చేసుకుంది. దీంతో ఇజ్రాయెల్ బలగాలు హమాస్ లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటికే 26,083 మంది మృతిచెందారు. వీరిలో 70 శాతం మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు పాలస్తీనా ఆరోగ్యశాఖ పేర్కొంది.