షహీద్ అవద్ బిహారీ ((Shaheed Avadh Behari).. దేశ స్వాతంత్య్రం కోసం విద్యార్థులకు విప్లవ పాఠాలు బోధించిన అభినవ ద్రోణాచార్యుడు. వలస పాలకులపై పోరు కోసం ఎంతో మంది పోరాట యోధులను తయారు చేసిన మేధావి. భారత వైశ్రాయ్ లార్డ్ హార్డింజ్ ను హత మార్చేందుకు పథకాలు రచించి చివరకు మృత్యువును ముద్దాడిన విప్లవ వీరుడు.
1889లో షహీద్ అవద్ బిహారీ ఢిల్లీలో జన్మించారు. లాహోర్ లోని బీటీ ట్రైనింగ్ కాలేజీలో లెక్చరర్ గా పని చేశారు. ఆ సమయం నుంచే బ్రిటీష్ పాలకులను దేశం నుంచి తరిమి వేయాలని అనుకున్నారు. తాను మొదలు పెట్టిన పోరాటం తనతోనే ఆగిపోకూడదని అనుకున్నారు.
అందుకే, మరికొందరు పోరాటయోధులను తయారు చేయాలనుకున్నారు. విద్యార్థులకు విప్లవ పాఠాలు బోధించి పోరుబాట పట్టించారు. విద్యార్థులతో పాటే తాను కూడా బాంబుల తయారీలో శిక్షణ పొందారు. స్వాతంత్ర్య పోరాటం గురించి కరపత్రాల ద్వారా ప్రచారం చేశారు. స్వయంగా ‘లిబర్టీ’ అనే కరపత్రాలను ముద్రించి ప్రచారం చేశారు. భారత వైశ్రాయ్ లార్డ్ హార్డింజ్ ను హత మార్చడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు.
అందుకోసం మరికొంత మంది పోరాట యోధులతో కలిసి ప్రణాళికలు రచించారు. దేశ రాజధానిని కోల్ కతా నుంచి ఢిల్లీకి మార్చిన సందర్భంగా లార్డ్ హార్డింజ్ హస్తినకు వచ్చాడు. ఇదే సమయం అనుకున్న విప్లవకారులు బాంబు దాడి చేశారు. కానీ స్వల్పగాయాలతో బయటపడ్డాడు.
ఈ కుట్రలో అవద్ బిహారీని కీలక సూత్రధారిగా గుర్తించి అరెస్టు చేశారు. అనంతరం ఆయన నివాసంలో తనిఖీలు చేయగా లిబర్టీ కరపత్రాలు, ఒక తల్వార్, బ్రిటీష్ అధికారి కర్జన్ లిల్లీని చంపిన మదన్ లాల్ డింగ్రా ఫోటోలు, పేలుడు పదార్థాలు లభించాయి. ఈ కేసులో 1915 మే 8న ఢిల్లీ సెంట్రల్ జైలులో అవద్ బిహారీని ఉరి తీశారు.