యూపీ (UP)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షాజహాన్ పూర్లో ఆటో రిక్షా (Auto Rikshaw)ను ట్రక్కు (Truck) ఢీ కొట్టింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. బరేలీ- ఫరూఖాబాద్ జాతీయ రహదారిపై అల్లాహగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుగ్సుగీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ట్రక్కు రాంగ్ రూట్లో వెళ్తోందని, దట్టమైన పొగ మంచు వల్ల విజిబిలిటీ సరిగా లేకపోవడంతో డంపర్ ఆటోను ఢీ కొట్టిందని వివరించారు. ఆటో రిక్షా జలాలాబాద్ వైపు నుంచి వస్తోందని పోలీసులు తెలిపారు. మదనాపూర్ ఏరియాలోని దంగద గ్రామంలో గంగా స్నానం చేసేందుకు గ్రామస్తులను సురేశ్ తన ఆటోలో తీసుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ పరారైనట్టు తెలిపారు. ట్రక్కును సీజ్ చేసినట్టు వెల్లడించారు. డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు వివరించారు. ట్రక్కు వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఆటో నుజ్జు నుజ్జయింది. మృతుల్లో ఎనిమిది మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. మృత దేహాలను పోస్టు మార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయక చర్యలు వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిచాలని ఆదేశాలు జారీ చేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని సీఎం యోగీ ఆకాంక్షించారు.
మరోవైపు తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మపురిలో బుధవారం వంతెన పై నుంచి వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి రెండుకార్లు సహా మరో రెండు లారీలను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా వచ్చిన ఓ లారీ దాన్ని ముందున్న మరో ట్రక్కును ఢీకొట్టింది. ఆ ట్రక్కు దాని ముందున్న మరో లారీని ఢీకొట్టింది. దీంతో రెండు లారీల మధ్య కారు ఇరుక్కుపోయింది. నియంత్రణ కోల్పోయిన మూడో లారీ బ్రిడ్జి పైనుంచి కిందకు పడిపోయింది. ఘటన అనంతరం వాహనాల్లో మంటలు చెలరేగాయి.