కాంగ్రెస్ (Congress) పాలనలో దేశంపై ఉగ్రవాద దాడులు, చొరబాట్లు ఉండేవని యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ (Yogi Adityanath) అన్నారు. ప్రధాని మోడీ వచ్చాక అలాంటివేవీ లేవని తెలిపారు. భాతర్ పై దాడికి ఇప్పుడు ఎవరూ సాహసించరని చెప్పారు. ఒక వేళ ఎవరైనా దాడులు చేస్తే వారిపై మెరుపు దాడులు చేస్తామని వెల్లడించారు. మోడీ సర్కార్ పాలనలో సరిహద్దుల రక్షణను బలోపేతం చేశామన్నారు.
దేశంలో మౌలికల వసతుల కల్పనకు మోడీ సర్కార్ ఎన్నో పథకాలు తీసుకు వచ్చిందన్నారు. గతంలో యూపీలో మాఫియా, అక్రమ దందాలదే రాజ్యంగా ఉండేదన్నారు. కొన్ని సార్లు నెలల పాటు కర్ఫ్యూలు ఉండేవన్నారు. కానీ బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చాక సీన్ మారిందన్నారు. మాఫియాలను, అక్రమ దందాలను బుల్డోజర్తో తొక్కిపడేశామన్నారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అదే జరుగుతుందన్నారు. మహబూబ్‌నగర్‌లో బీజేపీ నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత అయోధ్య రామ మందిర దర్శనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వుంటే రామ మందిర నిర్మాణం జరిగేదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ హయాంలో కేవలం మైనారిటీల సంక్షేమానికి మాత్రమే పెద్దపీట వేశారని విమర్శలు గుప్పించారు. సబ్ కా సాత్ .. సబ్ కా వికాస్ నినాదంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు. వీఆర్ఎస్కు సమయం వచ్చిందని కాబట్టే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల ఉమ్మడి స్నేహితుడు ఎంఐఎం అని చెప్పారు.
ముగ్గురు ఒకే తానులోని ముక్కలని మండిపడ్డారు. ఈ ముగ్గురిలో ఎవరికి ఓటు వేసినా ముగ్గురికీ వేసినట్లేనన్నారు. మహబూబ్‌నగర్‌ను తిరిగి పాలమూరుగా మార్చేందుకే తాను ఇక్కడికి వచ్చానన్నారు. పేపర్ లీకేజీల కారణంగా బీఆర్ఎస్ సర్కార్ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేకపోతోందన్నారు. యూపీలో ఆరేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు.