UP: ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఓ తరగతి గదిలో ముస్లిం బాలుడిని కొట్టవలసిందిగా టీచర్ ఇతర పిల్లలను రెచ్చగొట్టిన ఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రతిపక్షపార్టీలు బీజేపీని దుమ్మెత్తిపోశాయి. పిల్లల మనస్సులో ఇప్పటి నుంచే ద్వేషం, వివక్ష నింపుతున్నారని, వ్యాప్తి చెందింపజేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు.అమాయక బాలల మనస్సులో ఈ విష బీజాలను నాటుతున్నారని, పాఠశాల వంటి పవిత్రమైన సంస్థను ద్వేషంతో కూడిన మార్కెట్ గా మారుస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు.
ఇదే కిరోసిన్ నే బీజేపీ దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతంలోను చిమ్ముతూ నిప్పురాజేస్తోందని ఆయన అన్నారు. పిల్లలు ఈ దేశ భావిభారత పౌరులు.. వారికి ద్వేషాన్ని కాక.. ప్రేమను నేర్పాలి’ అని రాహుల్ సూచించారు. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు ఇలాంటి ద్వేషపూరిత రాజకీయాలను ఈ దేశంలో జొప్పించాయని, ఇవి చివరకు ఓ మైనారిటీకి చెందిన బాలుడిని కొట్టాలని ఒక టీచర్ ఇతర పిల్లలను ప్రోత్సహించడం వరకు వెళ్లిందని అన్నారు.
సంబంధిత టీచర్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసిన ఆయన.. టీచర్ల సమాజానికే ఆమె మచ్చ తెచ్చారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఈ వీడియోను జీ 20 మీటింగ్ లో ప్రదర్శించాలని, ద్వేష పూరిత రాజకీయాలను తామెలా సమర్థిస్తున్నామో వివరించాలని ఆయన వ్యంగ్యంగా కోరారు.
ఇంకా తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సుష్మిత దేవ్, ఎంఐఎం అధ్యక్షుడు,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. కాగా ముజఫర్ నగర్ ..ఖుబ్బాపూర్ గ్రామంలోని మన్సుర్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఆ టీచర్ ను త్రాప్తి త్యాగిగా గుర్తించారు. ఆ టీచర్ పై పోలీసులు కేసు పెట్టారు.