అయోధ్య (Ayodhya)లో జనవరి 22న రామ్ లల్లా (Ram Lalla) విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం తర్వాత రామ మందిరానికి భక్తులు పోటెత్తనున్నారు. రాబోయే రోజుల్లో అయోధ్యను ఒక గొప్ప ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య నగరాన్ని పునర్నిర్మించే అంశంపై యూపీ సర్కార్ ఫోకస్ చేసింది.
అయోధ్యలో 1,000 ఎకరాల విస్తీర్ణంలో టౌన్‌షిప్ (Township)ను నిర్మించనున్నట్టు యోగీ సర్కార్ వెల్లడించింది. దీనికి నవీ ‘అయోధ్య’అని పేరు పెట్టింది. ఈ టౌన్ షిప్‌ను ఆధునిక, సాంప్రదాయ నిర్మాణాల సమ్మేళనంగా నిర్మించనున్నట్టు రాష్ట్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి నితిన్ గోకర్న్ వెల్లడించారు. ఈ టౌన్ షిప్ నిర్మాణానికి కావాల్సిన భూమిని ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. దేశంలో వాస్తు ఆధారిత టౌన్ షిప్ అని చెప్పారు.
ఈ ప్రాంతంలో వాణిజ్య, నివాసాల అభివృద్ధి కోసం భూములు సేకరించేందుకు డెవలపర్లు ఆసక్తి చూపుతున్నారని అధికారులు చెబుతున్నారు. నదీ కేంద్రీకృత నగరంగా అయోధ్య ఉంటుందని గోకర్న్ తెలిపారు. త్వరలో దేశంలోని అత్యుత్తమ నగరాల్లో అయోధ్య ఒకటిగా మారబోతోందన్నారు. ఇక్కడ ధరలు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు.
ఇటీవల చదరపు మీటరుకు రూ.88,000 రిజర్వ్ ధరతో ప్రభుత్వం ఒక హోటల్ కోసం ప్లాట్‌ను వేలం వేసిందని వెల్లడించారు. ఈ ప్లాట్ కు బిడ్ ధర చదరపు మీటరుకు రూ.108,000 వచ్చిందన్నారు. క్లీన్ ప్రాపర్టీలకు అధిక డిమాండ్ ఉందని, అటువంటి భూమిని సేకరించడంలో డెవలపర్లకు సహాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
రాష్ట్ర అతిథి గృహానికి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని, ఆ తర్వాత వాణిజ్య అభివృద్ధి ప్లాట్లను వేలం వేయనున్నట్లు తెలిపారు. 2020 అగస్టులో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగినప్పటి నుండి, అయోధ్యలో భూముల ధరలు, ఆస్తి సంబంధిత లావాదేవీలు 50 శాతం పెరిగాయని చెప్పారు. రామ మందిర పూర్తయిన తర్వాత రామ మందిరాన్ని రోజు 80 వేల నుంచి లక్షమంది దర్శించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2019లో సుప్రీంకోర్టు వివాదాస్పద మత స్థలాన్ని హిందువులకు అప్పగించడంతో అయోధ్యలో ఆస్తుల ధరలు ఇప్పటికే 25 నుంచి 30 శాతం పెరిగాయి.