డబ్బులు తీసుకోడానికి ఏటీఎం (ATM) కి వెళ్లి అర్రే…కార్డు మర్చిపోయాం, మళ్లీ ఇంటికి వెళ్లాలా అని చాలా సార్లు బాధపడే ఉంటాం. ఫోన్ ఓటీపీ (OTP) ద్వారానో, మరేదైనా పాస్ వర్డ్ (Password) తో డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉంటే బాగుణ్ను కదా అనిపిస్తుంటుంది. సరిగ్గా ఇలాంటిదే కాకపోయినా, ఏటీఎం కార్డుతో పని లేకుండా ఏటీఎం మిషన్ నుంచి డబ్బులు తీసుకునే సౌకర్యం కల్పించింది హిటాచీ పేమెంట్ సర్వీసెస్.
భారతదేశపు మొట్టమొదటి UPI ATM ను హిటాచీ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన హిటాచీ పేమెంట్ సర్వీసెస్ UPI ATMను ప్రారంభించింది. ఈ సదుపాయంతో ప్రస్తుతం ఏటీఎం కార్డు లేకుండా డైరెక్టుగా UPI ద్వారా ATM నుండి డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. భారతదేశంలోని ప్రజలకు ఈ సౌకర్యాన్ని అందించడానికి ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ సర్వీసెస్ అందిస్తోంది. ఇది ATM వినియోగదారుల ఖాతాల నుండి UPI యాప్ ద్వారా చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది.
దీని వలన ఇవి లాభాలు..
ఈ సౌకర్యం కొత్త అనుభూతిని అందించడమే కాకుండా బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలు, విత్‌డ్రా పరిమితిని కూడా పెంచుతుంది. అదనంగా, UPI ATMలు కార్డ్ స్కిమ్మింగ్ వంటి ఆర్థిక మోసాలను నిరోధించడానికి వీలుగా ఉంటుందని సంస్థ తెలిపింది.
UPI ATM పని తీరు…
ముంబై గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో రవిసుతంజని కుమార్ చెప్పిన వివరాల ప్రకారం…దీనిలో UPI ATM టచ్ ప్యానెల్ ఉంటుంది. దీనిలోని UPI కార్డ్‌లెస్ క్యాష్‌పై నొక్కడం ద్వారా రూ. 100, రూ. 500, రూ. 1000, రూ. 2000, రూ. 5000.. ఇతర మొత్తాల వంటి నగదు మొత్తం ఎంపిక కోసం బటన్‌తో మరొక విండో ఓపెన్ అవుతుంది. దాన్ని ఎంచుకున్న తర్వాత, QR కోడ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
ఇలా విత్ డ్రా చేసుకోవచ్చు…
ఆ తర్వాత మనం ఏదైనా UPI యాప్‌ని ఉపయోగించి స్కాన్ చేయాలి. కోడ్‌ని స్కాన్ చేసిన తర్వాత, మనం కావాల్సిన బ్యాంక్ ఖాతాను ఎంచుకోవాలి. తర్వాత కన్ఫర్మ్‌పై క్లిక్ చేయమని అడుగుతుంది. ఇప్పుడు మనం ఎంత నగదు విత్ డ్రా చేసుకోవాలో నిర్ధారించుకోవాలి. దీని తర్వాత UPI పిన్ నమోదు చేయాలి. ఇలా చేసిన తర్వాత లావాదేవీ జరగబోతోందని UPI మెసేజ్ పంపబడుతుంది. దీని తర్వాత ATM మన డబ్బును విత్‌డ్రా చేస్తుంది.
UPI ATM ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై నిర్మించబడింది. దీని ద్వారా నగదు డిపాజిట్లు కూడా చేయవచ్చునని ఆ హిటాచీ పేమెంట్ సర్వీసెస్ సంస్థ తెలిపింది.