అమెరికాలో పెట్రోలింగ్ వాహనం ఢీ కొని ఏపీ విద్యార్థిని కందుల జాహ్నవి మరణించిన ఘటనలో తాజాగా సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది. యాక్సిడెంట్ తర్వాత జాహ్నవి మరణం గురించి ఓ పోలీసు అధికారి నవ్వుతూ, హేళనగా మాట్లాడటంపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
పోలీసు అధికారి బాడీ కెమెరాలో ఇదంతా రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. యాక్సిడెంట్ తర్వాత జనవరి 23న దర్యాప్తు అధికారి డేనియల్ ఆడెరర్ తన సహోద్యోగికి ఫోన్ చేసినట్టు వీడియో ద్వారా తెలుస్తోంది. ఆ సమయంలో జాహ్నవి గురించి పోలీసు అధికారి హేళనగా మాట్లాడటం వీడియోలో కనిపిస్తోంది. మృతురాలు ఓ సాధారణ వ్యక్తి అని ఆయన చెప్పినట్టు వినిపిస్తోంది.
ఆమె ప్రాణాలు కోల్పోయిందంటూ అడెరర్ చెప్పడం వీడియో ద్వారా తెలుస్తోంది. ఆ విషయం చెబుతున్న సమయంలో ఆ అధికారి నవ్వుతూ కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీటెల్ పోలీసు యూనియన్ నాయకులపై ఎంక్వైరీ మొదలు పెట్టినట్టు న్యూయార్క్ పోస్టు పేర్కొంది. దీనిపై టెల్ కమ్యూనిటీ పోలీసు కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. అడెరర్ వ్యవహరించిన తీరుపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేయనున్నట్టు పేర్కొంది.
ఏపీ కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి సౌత్ లేక్ యూనియన్లోని నార్త్ ఈస్టర్న్ వర్శిటీలో మాస్టర్స్ చదువుతోంది. ఈ ఏడాది జనవరిలో సియాటెల్ పోలీసుల పెట్రోలింగ్ వాహనం ఢీ కొట్టడంతో ఆమె మరణించారు. క్రాస్ వాక్ లో ఆమె రోడ్డు దాటుతున్న సమయంలో డెక్స్టర్ అనే అధికారి ఎస్ యూవీతో ఆమెను ఢీ కొట్టారు.