ఇజ్రాయెల్ (Israel) కు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) రేపు ఆదేశంలో పర్యటించనున్నారు. బైడెన్ పర్యటన విషయాన్ని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అంటోనీ బ్లింకన్ వెల్లడించారు. మరోవైపు గాజాకు సహాయం అందించే విషయంలో ఒక ప్రణాళికను అభివృద్ధి చేసేందుకు ఇజ్రాయెల్, అమెరికా అంగీకరించినట్లు బ్లింకన్ వెల్లడించారు.
ఇటీవల ఇజ్రాయెల్‌లో తన రెండవ పర్యటనలో ఆ దేశ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులతో బ్లింకన్ సుమారు ఎనిమిది గంటల పాటు సమావేశం అయ్యారు. ఇజ్రాయెల్ పట్ల అమెరికా సంఘీభావాన్ని అధ్యక్షుడ బైడెన్ పర్యటనతో పునరుద్ఘాంటించనున్నట్టు తెలిపారు. ఇజ్రాయెల్ భద్రత పట్ల తమ నిబద్ధతను ఆయన మరోసారి పునరుద్ఘాటిస్తారని పేర్కొన్నారు.
హమాస్, ఇతర ఉగ్రవాదుల నుండి తమ ప్రజలను రక్షించుకునేందుకు, భవిష్యత్తులో ఎలాంటి దాడులు జరగకుండా నిరోధించే హక్కు, బాధ్యత ఇజ్రాయెల్‌కు ఉంది అని అన్నారు. ఇజ్రాయెల్ అవసరాలను తీర్చేందుకు, అక్కడి ప్రజలను రక్షించేందుకు ఏమి అవసరమో ఇజ్రాయెల్ నేతలను అడిగి బైడెన్ తెలుసుకుంటారని ఈ సందర్బంగా ఆయన తెలిపారు.
హమాస్ పాలనలో ఉన్న భూభాగంపై భూతల దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ సిద్దమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో దిగ్బంధంలో ఉన్న గాజా స్ట్రిప్ ప్రజలకు మానవతా సహాయాన్ని అందించే విషయంలో ఇజ్రాయెల్ నుంచి అమెరికా స్పష్టమైన హామీని తీసుకుందని పేర్కొన్నారు.