గతేడాది చాలా మంది భారతీయులు అమెరికన్ సభ్యత్వం పొందినట్లు ఓ నివేదిక వెల్లడించింది. అమెరికన్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(USCIS) ఇటీవల విడుదల చేసిన 2023 వార్షిక పురోగతి నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 2023లో భారత్కి చెందిన 59,100 మంది అమెరికన్ పౌరసత్వాన్ని పొందారు.
2023 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ 30, 2023 నాటికి దాదాపు 8.7లక్షల మంది విదేశీ పౌరులు అమెరికన్ పౌరసత్వాన్ని పొందినట్లు ఆ నివేదిక పేర్కొంది. వీరిలో 1.1 లక్షల మంది మెక్సికన్లు 12.7శాతం, భారతీయులు 6.7శాతం (59,100 మంది) యూఎస్ పౌరసత్వం పొందినట్లు తెలుస్తోంది.
కొత్తగా నమోదు చేసుకున్న వారిలో 5.1 శాతం (44,800మంది) ఫిలిప్పీన్స్ నుంచి, డొమినికన్ రిపబ్లిక్ నుంచి 4 శాతం (35,200 మంది) ఉన్నారు. సాధారణంగా ఓ వ్యక్తి అమెరికన్ పౌరసత్వం పొందాలంటే కనీసం ఐదు సంవత్సరాలు అక్కడ ఉండాలి. పౌరసత్వం పొందేందుకు ఇమ్మిగ్రేషన్, జాతీయత చట్టంలో పేర్కొన్న అర్హతలు కలిగి ఉండాలి.
2022 సంవత్సరంలో లెక్కలు చూస్తే సుమారు 65వేల మంది భారతీయులు అమెరికన్ పౌరసత్వాన్ని పొందారు. మెక్సికన్ల వాటా అప్పుడు మరింత ఎక్కువగా ఉంది. ఆ ఏడాది విదేశీయులకు అమెరికా ఇచ్చిన పౌరసత్వాల సంఖ్య 9లక్షలకు పైనే ఉంది. 2022తో పోలిస్తే 2023లో అమెరికా 90వేల పౌరసత్వాలను తక్కువగా జారీ చేసింది.