ఇటీవల జోర్డాన్ (Jordan)లో తమ క్యాంప్‌పై దాడి చేసిన ఘటనల నేపథ్యంలో అమెరికా (USA) ప్రతీకార దాడులకు దిగింది. ఇరాక్, సిరియాలోని ఇరాన్ రెవల్యూషనరీ గార్డుల (IRGC) మద్దతు కలిగిన 85కుపైగా మిలీషియా స్థావరాలే లక్ష్యంగా అమెరికా యుద్ధవిమానాలు రంగంలోకి దిగాయి. దీంతో సిరియాలో 18 మంది మిలిటెంట్లు మృతి చెందారు.
జోర్డాన్‌లోని అమెరికా సైనిక క్యాంప్‌పై ఇటీవల డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ముగ్గురు అమెరికా సైనికులు మృతిచెందగా, సుమారు 40 మంది గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ దాడులు జరిగినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది.
ఈ క్రమంలో మిలిటెంట్లకు చెందిన కమాండ్ కంట్రోల్ ప్రధాన కేంద్రంతోపాటు ఇంటెలిజెన్స్ కేంద్రాలు, రాకెట్లు, క్షిపణులు, డ్రోన్లు, ఆయుధ సామగ్రి నిల్వల గోడౌన్లు, లాజిస్టిక్స్ సౌకర్యాలపై అమెరికా దాడులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అమెరికన్లకు ఎవరైనా హాని కలిగిస్తే, తాము తగిన సమాధానం ఇస్తామని ఈ దాడుల తరువాత అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత ఆదివారం జోర్డాన్‌లో ఇరాన్ మద్దతుగల ఉగ్రవాద గ్రూపులు జరిపిన డ్రోన్ దాడిలో ముగ్గురు అమెరికా సైనికులు మరణించారని ఆయన చెప్పారు.