అమెరికా(USA)లో తెలుగు విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో ఘటన విషాదాన్ని మిగిల్చింది. తెలంగాణ(Telangana)కు చెందిన ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం శివునిపల్లి గ్రామానికి చెందిన పార్శి గౌతమ్(19), కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన ముక్క నివేశ్(20) అమెరికాలోని అరిజోనా స్టేట్ వర్సిటీలో జాయిన్ అయ్యారు. వీరు అక్కడ బీటెక్ సెకండియర్ చదువుతున్నారు. అయితే శని, ఆది వారాలు సెలవులు కావడంతో వీరిద్దరూ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో వెకేషన్‌కు వెళ్లినట్లు సమాచారం.
ఈ క్రమంలో అరిజోనా రాష్ట్రం ఫినిక్స్‌లో వీరు వెళ్తున్న కారును ఓ ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గౌతమ్, నివేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అరిజోనా పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల్లో ముక్క నివేశ్ ప్రముఖ వైద్యులు డాక్టర్ ముక్క కృష్ణ మూర్తి మనువడుగా అధికారులు గుర్తించారు.
ముక్క నివేశ్ గత సంవత్సరం జనవరిలో ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చేయడానికి అరిజోనా రాష్ట్రంలోని ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడని నివేశ్ తల్లిదండ్రులు నవీన్, స్వాతి తెలిపారు. అదేవిధంగా గౌతమ్ కుమార్ ఇండియాకు తిరిగి రావడానికి మే 22న టికెట్ బుక్ చేసుకున్నాడని అతడి కుటుంబసభ్యులు తెలిపారు. ఈ లోపే ఈ ఘోరం జరిగిందంటూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.