అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్(Donald Trump) దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో యూఎస్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు ముందు రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల అభ్యర్థిత్వానికి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. రిపబ్లికన్ల తరఫున పోటీ చేస్తున్న ఆయన తాజాగా జరిగిన సౌత్ కరోలినా(South Carolina) ఎన్నికల్లో ప్రత్యర్థి, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీపై విజయం సాధించారు.
సౌత్ కరోలినా ఎన్నికల్లో ట్రంప్‌నకు 63శాతం ఓట్లు రాగా, నిక్కీ హేలీకి 36.8శాతం ఓట్లు వచ్చాయి. ఇది డొనాల్డ్‌కు వరుసగా ఐదో విజయం. గతంలో అయోవా, న్యూ హాంప్‌షైర్, నెవాడా, యూఎస్ వర్జిన్ ఐలాండ్స్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లోనూ ట్రంప్ గెలుపొందారు. అయితే నక్కీ హేలీ తన సొంత రాష్ట్రంలో నిక్కీ హేలీ ఓటమి పాలవడంతో బిగ్ షాక్ తగిలినట్లైంది.
తదుపరి ఎన్నికలు మార్చి 5న మిచిగావ్ రాష్ట్రంలో జరగనున్నాయి. మరోవైపు, డెమోక్రటిక్ పార్టీకి ప్రాథమిక ఎన్నికలు ఈ నెల 4న జరిగాయి. అందులో అధ్యక్షుడు జో బైడెన్ గెలుపొందారు. ఫలితాల అనంతరం నిక్కీ హేలీ మాట్లాడుతూ.. ఓటమిని అంగీకరించబోనని వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బైడెన్ మరోసారి ఎన్నికల్లో గెలుస్తారని ఇటీవల చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
గతంలో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించాక రిపబ్లికన్ల తరఫున అభ్యర్థిత్వాన్ని ఆశించిన వివేక్ రామస్వామి, రాన్ డీ శాంటీస్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ట్రంప్, హేలీ మాత్రమే పోటీ పడుతున్నారు. రేసు నుంచి తప్పుకోవాలని పలువురు హేలీకి సూచించినా ఆమె వాటిని తిరస్కరించారు.