తెలంగాణ (Telangana)లో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం.. సంచలన నిర్ణయాలు తీసుకొంటూ సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే అధికారులకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసిన రేవంత్ సర్కార్.. కరెంట్ విషయంలో అన్ని వివరాలు సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు వివిధ కార్పొరేషన్లకు చైర్మన్, వైస్ చైర్మన్‌లుగా నామినేటెడ్ పద్ధతిలో నియమితులైన పోస్టులన్నింటినీ రద్దు చేస్తూ ప్రకటన చేసింది.
తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam kumar Reddy)కి.. మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ కుంగడంపై నీటి పారుదల శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. హైదరాబాద్‌లోని జలసౌధలో, నీటి పారుదల శాఖపై నిర్వహించిన సమీక్షలో పలు విషయాలపై ఉత్తమ్ ఆరాతీశారు. ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలను ఈఎన్సీ మురళీధర్‌రావు వివరించారు.
ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని.. సుమారు లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ పదే పదే ఆరోపణలు గుప్పించారు.. అదే సమయంలో మేడిగడ్డ బ్యారేజీలో పిల్లరు కుంగిపోవటం కూడా తోడవటంతో.. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project)లో అవినీతి జరిగిందంటూ మరింత గట్టిగా ప్రచారం జరిగింది.
దీంతో ప్రభుత్వం ఏర్పాటు కాగానే కాళేశ్వరం అవినీతిపై విచారణ చేపడతామని.. బాధ్యులెవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. కాగా.. ఇప్పుడు కాళేశ్వరంపై అవినీతి గడీలు బద్ధలు కొట్టడానికి కాంగ్రెస్ సర్కారు సిద్దం అవుతోన్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే నీటి పారుదల అధికారులు చెప్పిన విషయాలు విన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు ప్లాన్ చేయండని అధికారులను ఆదేశించారు.
అలాగే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసిన ఏజెన్సీనీ, అధికారులను వెంట ఉండేలా చూడాలని.. ఎంత ఖర్చు చేసింది, ఒక్కో ఎకరా సాగుకు అవుతోన్న ఖర్చు ఎంతని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. అందుకు తగిన పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు..