సీఎం కేసీఆర్ అక్రమాలకు మేడిగడ్డ బ్యారేజే నిదర్శనమని నల్లగొండ ఎంపీ, హుజూర్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ(Congress party) అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకవీడులో బూత్ కమిటీ సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
బీఆర్ఎస్(BRS) మంత్రులు ఎమ్మెల్యేలు ఏదీ వదిలిపెట్టలేదని, అన్నింటిని దోసుకున్నారని ఆరోపించారు. డ్యాములు భూకంపాలు వచ్చినా తట్టుకోవాలని … కానీ ముట్టుకోకుండానే కుంగిపోతున్నాయని ఉత్తమ్ విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్టు ఏ విధంగా అయితే కుంగిపోయిందో ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం కూడా అలాగే కుంగిపోతుందని స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగటం, అన్నారంలో బుంగలు పడటం ప్రపంచంలోనే అరుదైన ఘటనలు అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన నాగార్జునసాగర్, పోచంపాడు, శ్రీశైలం ప్రాజెక్టులు 60 ఏళ్ల కింద కట్టిన నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని గుర్తు చేశారు. నవంబర్ 30న తలరాతలు మారబోతున్నాయని, కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతోందని తెలిపారు. రైతుబంధు విషయంలో కానీ ప్రభుత్వ పథకాలలో తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, స్వయంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ స్పష్టం చేశారని తెలిపారు. ఓటమి భయంతోనే కేసీఆర్ అబద్ధాలు ఆడుతున్నారని అన్నారు.
రాష్ట్రంలో బై బై కేసీఆర్ అని.. హుజూర్ నగర్ లో బైబై సైదిరెడ్డి అని ప్రజలు చెబుతారని అన్నారు. రానున్న ఎన్నికల్లో 50వేల మెజార్టీకి ఒక్క ఓటు తగ్గిన తను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మరోసారి స్పష్టం చేశారు. ఈనెల 10న కోదాడ హుజూర్ నగర్ లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వస్తున్నారని, రోడ్ షోలో పాల్గొంటారని తెలిపారు.
డిసెంబర్ మొదటి వారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నట్లు తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని కానీ ఈ ప్రభుత్వం రైతుల రుణమాఫీ నేటికీ చేయలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను తప్పక అమలు చేస్తామన్నారు.