ఉత్తరప్రదేశ్ (Uttara Pradesh) రాజధాని లక్నో పట్టణంలో ఉన్న ఓ కళాశాల మైదానంలో సడెన్ గా హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యి ఆశ్చర్యానికి గురిచేసింది. ఎటువంటి సమాచారం లేకుండా విమానం మైదానంలో ల్యాండ్ అవడం వల్ల కాలేజీ విద్యార్థులు, సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.
లక్నో పట్టణంలో ఉన్న లామార్టినియర్ కాలేజీ (Lamartineyar College)లో.. 139వ జూనియర్ స్కూల్ స్పోర్ట్స్ డే ఈవెంట్‌ను నిర్వహించారు. ప్రోగ్రాంలో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో.. కళాశాలకు చెందిన పోలో మైదానంలో ఉన్నట్టుండి VT-UPLఅనే పేరుగల హెలికాఫ్టర్ (Helicopter) ల్యాండ్ అయింది. అలా ఊహించని విధంగా హెలికాఫ్టర్ ల్యాండ్ అవడంతో, కాలేజీలో ఉన్న విద్యార్థులు, సిబ్బంది గట్టిగా అరిచారు..
మరోవైపు హెలికాఫ్టర్ ల్యాండింగ్ సమయంలో వచ్చే గాలికి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లు, జెండాలు, టెంట్లు, స్తంభాలు నేలకూలాయి.
అదీగాక హెలికాఫ్టర్ ల్యాండింగ్ సమయంలో చుట్టూ వ్యాపించిన దుమ్ము కారణంగా విద్యార్థులు, సిబ్బంది, ప్రేక్షకులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. మరోవైపు ఈ వ్యవహారంపై కళాశాల ప్రిన్సిపల్, అధికారులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు.
ముందస్తు సమాచారం లేకుండా విమానాన్ని ఎలా ల్యాండింగ్ చేస్తారన్న కళాశాల ప్రిన్సిపల్.. పౌర విమానయాన శాఖతో పాటు డైరెక్టరేట్ ఆఫ్ ఎయిర్ సేఫ్టీ అధికారులను ప్రశ్నించారు. ప్రస్తుతం హెలికాప్టర్ ల్యాండింగ్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.