కులం కూడుపెట్టదు.. మతం బ్రతుకు దారి చూపదు.. కాని కొందరు మతం ముసుగులో ఆరాచకాలు చేస్తున్న ఘటనలు ఎక్కడో ఒకచోట వెలుగులోకి వస్తున్నాయి.. తాజాగా ఇలాంటి ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)..ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో వెలుగు చూసింది.. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న లారెబ్ హష్మీ(20) అనే వ్యక్తి బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో టికెట్ ధర విషయంలో కండక్టర్ హరికేష్ విశ్వకర్మ(24)తో గొడవ పెట్టుకున్నాడు.
మాటమాట పెరిగి విశ్వకర్మపై పదునైన కత్తితో దాడి చేశాడు హష్మీ. ఈ దాడిలో కండక్టర్ (Conductor) మెడ, ఇతర శరీర భాగాలకు గాయాలయ్యాయి. ఘటన అనంతరం బస్సు నుంచి పారిపోయిన హష్మీ.. తాను చదువుకుంటున్న కాలేజీ క్యాంపస్‌లోకి వెళ్ళి దాక్కున్నాడు.. సమాచారం అందుకున్న పోలీసులు క్యాంపస్‌లో ఉన్న హష్మీని అదుపులోకి తీసుకున్నారు. తన నేరాన్ని అంగీకరించిన నిందితుడు.. బస్ కండక్టర్ దైవదూషణకు పాల్పడ్డట్లు ఆరోపించాడు, అందుకు దాడి చేశానని వెల్లడించాడు.
మరోవైపు పోలీసులను చూసిన నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా.. తుపాకీతో కాలిపై గాయపరిచి అతడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. హష్మీ తండ్రి మహ్మద్ యూనస్ ఫౌల్ట్రీఫారం నడుపుతున్నట్లు తెలిపిన డీసీపీ అభినవ్ త్యాగి..నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. కాగా ఈ ఘటన తర్వాత కాలేజీ యాజమాన్యం నిందితుడిని సస్పెండ్ చేసినట్టు తెలిసింది.