ప్రభుత్వాలు ఎన్ని మారిన సామాన్యులకి ఒరిగేది ఏమి ఉండదనేది నగ్న సత్యం.. అయినా ఈ నిజాన్ని అంగీకరించక కొందరు వితండవాదం చేయడం అక్కడక్కడా కనిపిస్తోంది. ఇక బ్రతికి ఉన్నప్పుడు ఎలాగో పేదవాడికి మర్యాద ఉండదు.. కనీసం మరణం అయినా మర్యాదని ఇస్తుందా అంటే.. అది కలనే అని కొన్ని ఘటనలు నిరూపిస్తాయి.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన పేదవాడి చావు విలువని తెలియచేసింది..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వ ఆస్పత్రి ( Government Hospital)లో ఓ మహిళ గుండెపోటు (Heart Attack)తో మంగళవారం సాయంత్రం మరణించినట్టు సమాచారం.. కాగా ఆ మృతదేహాన్ని వారి ఊరికి తీసుకెళ్లాడానికి.. మృతురాలి భర్త, ఆస్పత్రి సిబ్బందిని అంబులెన్స్ కోసం అడిగారని తెలుస్తోంది. కానీ కనికరం లేకుండా వారు నిరాకరించినట్టు సమాచారం.. దీంతో చేసేది ఏం లేక ఆ పేదవాడు తన భార్య మృత దేహాన్ని తోపుడు బండిపై తీసుకెళ్లినట్టు సమాచారం..
ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో ఆస్పత్రి అధి కారులు ఉలిక్కిపడ్డారని తెలుస్తోంది. మరోవైపు బాధితుడి వివరాల ప్రకారం.. అస్రౌలీ గ్రామానికి చెందిన వేదరామ్ తన భార్యకు గుండెపోటు రావడంతో ఫిరోజాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు. అక్కడ చికిత్స పొందుతూ.. అతని భార్య మరణించినట్టు తెలిపాడు.. ఈ క్రమంలో తన భార్య శవాన్ని తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వమని వేదరామ్ ప్రాధేయపడినా సిబ్బంది నిరాకరించినట్టు వెల్లడించాడు..
తన ఊరు పొరుగు జిల్లాలో ఉందన్న నెపంతో అంబులెన్స్ ఇవ్వడానికి సిబ్బంది నిరాకరించారని వేదరామ్ చెప్పాడు. దీంతో చేసేది ఏంలేక బంధువుల సహకారంతో భార్య శవాన్ని తోపుడు బండిపై ఉంచి ఇంటికి బయల్దేరాడు. ఈ ఫోటోలు వైరల్ కావడంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ సంఘటనపై విచారణకు ఆదేశించినట్టు సమాచారం..