ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకొంది. ఎటాహ్ (Etah)లోని కసాపూర్వి (Kasapurvi) గ్రామం నుంచి గంగాస్నానానికి వెళ్తున్న ట్రాక్టర్, కస్గంజ్ (Kasganj) జిల్లాలో ఘోర ప్రమాదానికి (Accident) గురైంది. బదౌన్ హైవేపై ఉన్న చెరువులో అదుపు తప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకొన్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ప్రారంభించారు.
పోలీసులు, గ్రామస్తుల సహకారంతో చెరువు నుంచి బాధితులను బయటకు తీశారు. కాగా మధ్యాహ్నం సమయానికి 15 మృతదేహాలను బయటకు తీసినట్లు సమాచారం అందించారు.. కాసేపటి తర్వాత మరో నాలుగు మృతదేహాలను వెలికితీసినట్లు వెల్లడించారు. దీంతో మరణించిన వారి సంఖ్య మొత్తం 19కి చేరిందని తెలిపారు. మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ప్రమాదంపై సమాచారం అందుకొన్న కస్సా తూర్పు గ్రామానికి చెందిన ప్రజలు, అక్కడికి చేరుకోవడంతో చెరువు గట్టుపై గందరగోళం నెలకొంది. రద్దీ కారణంగా హైవేపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక మరణించిన వారిలో మహిళలు, పలువురు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
మరోవైపు ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) స్పందించారు.. ఈ ప్రమాదం తీవ్ర విషాదంగా పరిగణించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.. ఈమేరకు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.