Telugu News » Uttarakhand : ఉత్తరాఖండ్​లో ఉద్రిక్తత పరిస్థితులు.. గొడవలకు దారితీసిన కూల్చివేతలు..!

Uttarakhand : ఉత్తరాఖండ్​లో ఉద్రిక్తత పరిస్థితులు.. గొడవలకు దారితీసిన కూల్చివేతలు..!

మరోవైపు హింస తీవ్రమవుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్​ సేవలను నిలిపివేశారు. విద్యాసంస్థలకు సైతం సెలవు ప్రకటించారు. హింసను నియంత్రించేందుకు జిల్లా మెజిస్ట్రేట్ కర్ఫ్యూ, ఉత్తర్వులను జారీ చేశారు.

by Venu

ఉత్తరాఖండ్‌ (Uttarakhand), హల్దానీ (Haldwani)లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన మదర్సా కూల్చివేత ఉద్రిక్తంగా మారింది. ఈ హింసలో నలుగురు మరణించగా.. సుమారుగా 250 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.. కోర్టు ఆదేశాల మేరకు అక్రమంగా నిర్మించిన మదర్సాను కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నించారు. ఇదే సమయంలో ఆందోళనకారులు దాడికి దిగారు. దీంతో భారీగా హింస చెలరేగింది.

ఆందోళనకారులతో జరిగిన ఘర్షణలో 50 మందికి పైగా పోలీసులు, మున్సిపల్ అధికారులు సహా సిబ్బంది గాయపడినట్లు తెలుస్తోంది. పోలీసులతో పాటు మదర్సాను కూల్చివేయడానికి వచ్చిన మున్సిపల్​ కార్మికులపై అల్లరి మూకలు రాళ్లు రువ్వారు.. వీరిని అదుపు చేసే ప్రయత్నంలో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. కాగా క్షతగాత్రుల్లో పోలీసులు, అధికారులు, మీడియా ప్రతినిధులు ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం హల్ద్వానీలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కేంద్ర భద్రతా బలగాలను భారీగా మోహరించారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ (Uttarakhand) సీఎం పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) స్పందించారు. కోర్టు ఆదేశాలతోనే కూల్చివేతకు అధికారులు వెళ్లారని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మాత్రమే పోలీసులతో ఘర్షణపడ్డారని తెలిపారు.. హింసకు అదే కారణమని స్పష్టం చేశారు. శాంతిభద్రతను కాపాడేందుకు అందనంగా పోలీసులు, కేంద్రబలగాలను మోహరిస్తున్నామని.. ప్రజలు శాంతిని పాటించాలని పేర్కొన్నారు.

మరోవైపు హింస తీవ్రమవుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్​ సేవలను నిలిపివేశారు. విద్యాసంస్థలకు సైతం సెలవు ప్రకటించారు. హింసను నియంత్రించేందుకు జిల్లా మెజిస్ట్రేట్ కర్ఫ్యూ, ఉత్తర్వులను జారీ చేశారు. కర్ఫ్యూ విధించడంతో నగరం నిర్మానుష్యంగా మారింది. ఇదిలా ఉండగా మదర్సా కూల్చివేతను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఉత్తరాఖండ్ హైకోర్టు విచారణ చేపట్టింది. కానీ, కోర్టు స్టే విధించడానికి నిరాకరించడంతో కూల్చివేత కొనసాగింది. కాగా ఈ కేసుపై మరోసారి 14న హైకోర్టులో విచారణ జరగనుంది.

You may also like

Leave a Comment