వల్లియప్పన్ ఒలగనాథన్ చిదంబరం పిళ్లై (V.O.Chidambaram Pillai)…. తమిళ్ హెల్మ్స్ మ్యాన్ (Helms Man)గా ప్రసిద్ది చెందిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. దేశంలో స్వదేశీ స్టీమ్ నావిగేషన్ ను స్థాపించిన మొదటి వ్యక్తి. ట్యూటీకోరన్‌లో ముత్యపు పరిశ్రమలో పని చేసే కార్మికుల కోసం దీక్ష చేసిన గొప్ప నేత. దేశ ద్రోహం ఆరోపణలు ఎదుర్కొని జీవిత ఖైదు అనుభవించిన గొప్ప దేశ భక్తుడు.
5 సెప్టెంబర్ 1872న తమిళనాడు తిరున్యవేలీలోని ఒట్టపిడారంలో జన్మించారు. తల్లిదండ్రులు ఉలగనాథన్ పిళ్లై, పరమయి అమ్మాళ్. తండ్రి బాటలో పయనించి తాను బారిష్టర్ అయ్యాడు. న్యాయవాదిగా పేదల దగ్గర ఎలాంటి ఫీజు తీసుకోకుండా కేసులు వాదించేవారు. 1905లో వచ్చిన స్వదేశీ ఉద్యమానికి ఆకర్షితుడైన స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నాడు.
బాల గంగాధర తిలక్‌ను తన గురువుగా భావించాడు. భారత-శ్రీలంక జలాల్లో బ్రిటీష్ స్టీమ్ నావిగేషన్ కంపెనీ గుత్తాధిపత్యానికి చరమగీతం పాడాలనుకున్నారు. అనుకున్నట్టుగానే దేశంలో మొదటి స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీని స్థాపించారు. దీంతో ఆయనపై బ్రిటీష్ అధికారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 27 ఫిబ్రవరి 1908న ట్యూటికోరిన్‌లోని బ్రిటిష్ యాజమాన్యంలోని కోరల్ మిల్స్‌లో కార్మికుల దుర్బర పరిస్థితులకు నిరసగా పిళ్లై దీక్ష చేశారు.
ఈ సందర్బంగా తీసిన ర్యాలీలో అల్లర్లు చెలరేగాయి. ఈ నేపథ్యంలో సిళ్లైతో పాటు ఆయన స్నేహితులను బ్రిటీష్ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనపై దేశ ద్రోహం కేసు నమోదు చేసి 20 ఏండ్ల దేశ బహిష్కరణ శిక్ష విధించారు. ఆ తర్వాత దాన్ని ఆరేండ్లకు తగ్గించారు. 1912లో ఆయన షిప్పింగ్ కంపెనీని బ్రిటీష్ వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో 18 నవంబర్ 1936న ట్యూటికోరిన్‌లోని భారత జాతీయ కాంగ్రెస్ కార్యాలయంలో మరణించారు.