వినాయక నవరాత్రోత్సవాలు (Vinayaka Chavithi) అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. గణనాథుల విగ్రహాలు (Ganesh Idols) విభిన్న రూపాల్లో ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో చోట ఒక్కో రూపంలో…వెరైటీ కాన్సెప్ట్ (Variety Concepts) లతో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు చూడగానే వావ్ అనిపిస్తున్నాయి.
ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ సెట్టింగ్‌లో కొలువుదీరిన గణపతి, నెమలి గణపతి, చెరుకుగడ వినాయకులు, గవ్వలు, గాజులు, తామర గింజలు, డ్రైఫ్రూట్స్…ఇలా రకరకాల రూపాల్లో వినాయకులను తయారు చేసి ప్రతిష్టించారు. నిండైన రూపం, రకరకాల రంగుల విగ్రహాలే గాక ప్రజలకు సందేశాన్నిచ్చే వినాయకులను నెలకొల్పడంతో భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
చంద్రయాన్ గణపతి…
విజయవాడ పట్టణంలోని వన్ టౌన్ పరిధిలో చంద్రయాన్-3 ప్రయోగం తరహాలో ఆకృతులను తయారు చేసి అందులో వినాయకుడిని ప్రతిష్టించారు. రాకెట్ నింగిలోకి ఎగిరిన అనంతరం జాబిల్లిపై బొజ్జగణపయ్య దర్శనమిస్తారు. అనంతరం చంద్రుడిపై ఉన్న వినాయకుడి చుట్టూ విక్రమ్ ల్యాండర్ చక్కర్లు కొట్టేలా టెక్నాలజీని వినియోగించారు. ఈ విగ్రహాలకు సంబంధించి వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇతర ప్రాంతాల నుంచి.. జిల్లాల నుంచి ఈ ‘జాబిల్లిపై గణపయ్య’ విగ్రహాలను చూడటానికి జనాలు తరలివస్తున్నారు.
రాకెట్ వినాయకుడు…
ఏపీలోనే కాకుండా తెలంగాణాలో కూడా చంద్రయాన్ కాన్సెప్ట్ వినాయకుడు కొలువుదీరాడు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు వీర శివాజీ నగర్ కాలనీకి చెందిన కాలనీవాసులు ఈ ఆలోచన చేశారు. చంద్రయాన్ ప్రయోగాన్ని స్ఫూర్తిగా తీసుకొని వినాయక చవితి సందర్భంగా చంద్రయాన్-3 రాకెట్ రూపొందించి అందులో వినాయకుడిని ప్రతిష్టించారు ఈ కాలనీ వాసులు.
1001 కలశాల గణేషుడు…
ఇక బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో విభిన్న ఆకృతుల్లో గణనాధులు కొలువుతీరారు. స్థానిక మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ లో గణనాధుడు ప్రతి ఏటా ఒక్కొక్క ప్రత్యేక రూపంలో దర్శనమిస్తూ స్థానికులను ఆకర్షిస్తాడు. ఈ ఏడాది 1001 కలశాలతో సుమారు 20 అడుగుల మహాగణపతిని తయారు చేసి వినాయకచవితి సందర్భంగా ప్రత్యేక పూజాలు నిర్వహిస్తున్నారు. చీరాలలో నెమలి పింఛాలతో తయారు చేసిన వినాయకుడు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
చెరుకు గడల గణనాధుడు…
నంద్యాలలో చెరుకు గడలు, తామర గింజలతో వినాయకుడిని తయారు చేశారు. శ్రీ ఇక్షు దండ మహా గణపతి పేరుతో ఇక్కడ ప్రతిష్టించారు. నంద్యాలలోని బాలాజీ కాంప్లెక్స్ సమీపంలో సముద్ర గవ్వలతో తయారు చేసిన వినాయకుడిని ఏర్పాటు చేశారు.