ఏపీ (AP)లో ఎన్నికల ప్రచారం ఆసక్తికరంగా సాగుతోంది. అన్ని పార్టీలు తమదైన శైలిలో ముందుకు వెళ్తున్నాయి. ఇక కూటమిగా ఏర్పడిన టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) ఎలాగైనా గెలుపు అందుకోవాలని తెగ ఆరాటపడుతున్నాయి. ఇదే సమయంలో వైసీపీ (YCP)కి సైతం ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి..
మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఆ గ్లామర్ ఎన్నికల ప్రచారంలో తోడ్పడుతోంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండగా.. ఆయన తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి నటులు రావడం కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ నటులు ప్రచారం చేసారు. అందులో హైపర్ ఆది, గెటప్ శీను, డ్యాన్స్ మాస్టర్ తదితరులు ఉన్నారు..
ఈ క్రమంలో నటుడు వరుణ్ తేజ్ (Varun Tej) సైతం బాబాయ్ కి తోడుగా రంగంలోకి దిగారు.. శనివారం పిఠాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులతో కలిసి ఆలయంలో పూజలు నిర్వహించిన ఆయన.. అనంతరం పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో రోడ్ షోలో సాయంత్రం పాల్గొని ప్రసంగించారు.
బాబాయ్ కి మద్దతు ఇచ్చేందుకు కుటుంబ సభ్యులందరూ తన వెంట ఉంటామని వరుణ్ తేజ్ మీడియాకు తెలిపారు. మరోవైపు పవన్ పై ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలపై స్పందించిన వరుణ్ తేజ్.. నిజాయితీ విలువ తెలియని వారే అలా మాట్లాడుతారని పేర్కొన్నారు.. ఇక వైసీపీ ఓటమి లక్ష్యంగా ఈ కూటమి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ.. జగన్ పై విమర్శలతో విరుచుకు పడుతుంది.
అధికారంలోకి రావాలని టీడీపీ కూటమి ప్రయత్నిస్తుండగా.. అది కోల్పోకుండా ఉండటం కోసం జగన్ వ్యూహాలు రచించడం కనిపిస్తోంది. మొత్తానికి ఏపీ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి.. రిజల్ట్ వచ్చే వరకు ఈ ఉత్కంఠ వీడేలా లేదని అనుకొంటున్నారు..