ఏ కులమైనా కుర్చీ ఇవ్వదని, వ్యక్తి నిర్మాణం విద్యతోనే వస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu)పేర్కొన్నారు. అమరావతి (Amaravati)లోని ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్టు (Swarna Bharati Trust)లో ఘనంగా నిర్వహించిన ఏబీవీపీ (ABVP) అమృతోత్సవ వేడుకలలో పాల్గొన్న వెంకయ్య నాయుడు పలు విషయాల పై మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక దేశ యువతలో బానిసత్వాన్ని తొలగించి, వారిని చైతన్యం చేసేందుకు 1949 జులై 9న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏర్పాటైందని అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో ఏబీవీపీ విస్తరిస్తోందని తెలిపారు..
మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ, విద్యార్థుల్లో జాతీయ భావాలను పెంచుతూ జాతి పునర్ నిర్మాణమే లక్ష్యంగా ఏబీవీపీ ముందుకు సాగుతోందని వెంకయ్య నాయుడు అన్నారు.. దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైన పరిషత్ నేడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విస్తరిస్తూ 35 లక్షల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థి సంస్థగా ఏబీవీపీ విరాజిల్లుతోందని వెల్లడించారు.
ఏబీవీపీనే తనకు నాయకత్వంలో తర్ఫీదు ఇచ్చిందని వెంకయ్య నాయుడు తెలిపారు. తాను అంచెలంచెలుగా జాతీయ స్థాయిలో ఎదగడానికి ఏబీవీపీ ఎంతగానో తోడ్పడిందని వెంకయ్య నాయుడు అన్నారు.. యువత మంచి ఆలోచనలతో రాజకీయాలను అధ్యయనం చేయాలని వెంకయ్య పిలుపునిచ్చారు. భవిష్యత్ తరంలో భారతదేశం మరింత శక్తివంతంగా మారాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. మరోవైపు ఏబీవీపీలో పని చేసిన పూర్వ నేతలు, ప్రస్తుత కార్యకర్తలు ఈ ఆత్మీయ సమావేశం లో పాల్గొన్నారు..