ఉపరాష్ట్రపతిగా పనిచేసిన తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి రావడం మంచిది కాదని భావించానని అందుకే ఇన్ని రోజులు ప్రజల్లోకి రాలేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సోమవారం ఆయన ‘పద్మ విభూషణ్’ అందుకున్న తర్వాత తొలిసారి ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఢిల్లీలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
తాను చేసిన సేవలకు పద్మ విభూషణ్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ప్రజా సమస్యలను, ఇతర అంశాలను నిన్న కూడా ప్రధానితో చర్చించానని తెలిపారు. ఇకపై పార్టీ రాజకీయాల్లోకి వెళ్లనని, సాధారణ రాజకీయాలపై స్పందిస్తానన్నారు. రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తానని తెలిపారు. కళాశాలలు,యూనివర్సిటీలు, ఐఐఎం అనేక సంస్థల కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు. ప్రజా జీవితంలో ప్రతీఒక్కరు ఉత్సాహంగా ఉండాలని సూచించారు.
ఎవరిపని వారు సక్రమంగా చేసుకోవడమే దేశభక్తి అన్నారు. నేతలు పార్టీలు మారడం ట్రెండ్‌గా మారిందని, ఇది డిస్ట్రబింగ్ ట్రెండ్ అని వ్యాఖ్యానించారు. పదవికి రాజీనామా చేసి ఏపార్టీలో అయినా చేరవచ్చని, కానీ పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలు మారి నేతలను విమర్శించడం సరికాదని అభిప్రాయపడ్డారు. యాంటీ డిఫెక్షన్ లా ను బలోపేతం చేయాలని సూచించారు.
చెట్లకు డబ్బులు కాయవనేది వాస్తవమని, రాజకీయపార్టీలు ఏం చేయగలుగుతారో అవే మేనిఫెస్టోలో హామీలుగా ఇవ్వాలని సూచించారు. తాను ఉచితాలకు వ్యతిరేకమని వెంకయ్యనాయుడు చెప్పుకొచ్చారు. ప్రజలూ ఉచితాలను ప్రశ్నించాలన్నారు విద్య, ఆరోగ్యం ఉచితంగా ఇవ్వాలన్నారు. అసభ్యంగా మాట్లాడేవారు, అవినీతి పరులను ప్రజలు తిరస్కరించాలని హితవుపలికారు.
బీజేపీకి తాను ఇచ్చే స్థానం తన జీవితంలో మారదని వెంకయ్యనాయుడు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తాను రాజ్యసభ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఆమోదం పొందడం జీవితంలో గొప్ప అంశమని పేర్కొన్నారు. లోక్‌సభలో మెజారిటీ ఉన్నా మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టారని, సభను వాయిదా వేయకుండా నడిపించానని గుర్తుచేసుకున్నారు. శాంతియుతంగా చర్చల ద్వారా ప్రజాస్వామ్యయుతంగా ఆర్టికల్ 370 రద్దు బిల్లు ఆమోదం పొందిందని పునరుద్ఘాటించారు.
రాజకీయ పార్టీలు వారి సభ్యులను పార్లమెంట్ ప్రొసీడింగ్స్ సరిగా జరిగేలా శిక్షణ ఇవ్వాలన్నారు. దేశం రోజు రోజుకు ముందుకు వెళ్తోందని, ప్రపంచం భారత్ వైపు చూస్తోందని తెలిపారు. శత్రు దేశాలు భారత్‌ను చూసి ఓర్వలేకపోతున్నాయని అన్నారు. అన్ని రాజకీయపార్టీలు ప్రజాస్వామ్య బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజలంతా ఓటింగ్‌లో తప్పకుండా పాల్గొనాలని, ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటే ఆ పార్టీకి వేయాలని వెంకయ్యనాయుడు సూచించారు.