దేశంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) పవర్‌లోకి వస్తేనే బీసీ(BC)లకు న్యాయం సాధ్యమని మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు(VH) అన్నారు. సోషల్ మీడియాలో ఇవాళ(ఆదివారం) ఆయన ఓ వీడియో పోస్ట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
బీసీలకు న్యాయం జరగాలంటే కుల గణన చేయాల్సిందేనని నొక్కి చెప్పారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మెజార్టీ అభ్యర్థులను పార్లమెంటుకు పంపాలని వీహెచ్ రిక్వెస్ట్ చేశారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుల గణన చేసి అన్ని కులాలకు న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని గుర్తు చేశారు.
ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పి అధికారంలోకి రాగానే అమలు ప్రక్రియ మొదలు పెట్టామని వీహెచ్ అన్నారు. మాట నిలబెట్టుకునే తత్వం ఇందిరమ్మ కుటుంబంలో ఉన్నదని, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు.
రాహుల్ గాంధీ కులగణన చేస్తామన్న హామీ తప్పకుండా అమలు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సకల ప్రజలు సంపూర్ణమైన ఆనందంతో జీవించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని వీహెచ్ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.