అరాచక వాదుల నుంచి ధర్మాన్ని పరిరక్షిస్తామని విశ్వ హిందూ పరిషత్ (VHP) రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి (Surender Reddy) అన్నారు. దేశ భద్రత ప్రతి యువకుడి బాధ్యత అని తెలిపారు. భారతీయ వాస్తవ చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. కామన్ సివిల్ కోడ్ సాధించి సమన్యాయం పొందాలన్నారు. మతాలకు అతీతంగా జనాభా సమతుల్యత పాటించాలన్నారు.
మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ….. నేటి సమాజంలో భారతీయతపై, హిందుత్వంపై అరాచక వాదులు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని పెకిలించి వేస్తామని వెకిలి మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అలాంటి అరాచక, ఉగ్ర మూకలకు తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు హిందూ సమాజం సిద్ధంగా ఉండాలన్నారు.
ధర్మ రక్షణలో ఎంతటి త్యాగానికైనా బజరంగ్ దళ్ సంసిద్ధమేనన్నారు. హేతువాదులు, లౌకిక వాదుల ముసుగులో ధర్మాన్ని కించపరిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని తేల్చి చెప్పారు. దేశంలోని యావత్ యువతను మేల్కొల్పేందుకు విశ్వహిందూ పరిషత్ – బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శౌర్య జాగరణ యాత్ర చేపడుతున్నామని వెల్లడించారు. తెలంగాణలోని ప్రతి పల్లె, ప్రతి జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుందన్నారు.
ఈ నెల 30 నుంచి వచ్చే నెల 14 వరకు శౌర్య జాగరణ యాత్ర నిర్వహిస్తామన్నారు. భారతీయత కోసం, సనాతన ధర్మం కోసం పోరాడిన పరాక్రమ వీరుల చరిత్రను నేటి సమాజానికి తెలియజేసి వారిని జాగృతం చేస్తామన్నారు. వక్రీకరించిన చరిత్ర కాకుండా, వాస్తవ చరిత్రను నేటి సమాజం తెలుసుకోవాలన్నారు. ఆ విషయంలో అందరికీ అవగాహన కల్పిస్తామన్నారు.