ఏపీ(AP) వైద్యారోగ్యశాఖ మంత్రి(Health Minister) విడదల రజని(Vidadala Rajani) కార్యాలయంపై అర్ధరాత్రి ఆకతాయిలు దాడి చేసిన సంగతి తెలిసిందే. సమాచారం అందుకున్న పోలీసులు రజనీ ఆఫీసు వద్దకు చేరుకుని టీడీపీ కార్యకర్తలను చెదర గొట్టేందుకు యత్నించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 50మందిని అరెస్ట్ చేశారు. విచారణ కొనసాగుతోంది.
అసలేం జరిగిందంటే.. న్యూ ఇయర్ సందర్భంగా మంత్రి కార్యాలయం వద్ద టీడీపీ, జనసేన శ్రేణులు హంగామా సృష్టించారు. విద్యానగర్‌లోని మంత్రి నూతన పార్టీ కార్యాలయంపై అర్ధరాత్రి రాళ్ల దాడి చేశారు. నడిరోడ్డుపై వైసీపీ జెండాలను టీడీపీ శ్రేణులు తగలబెట్టాయి. కొత్తగా నిర్మించిన ఆఫీసు దగ్గరి ఫ్లెక్సీలను చించేసి, అద్దాలు ధ్వంసం చేశారు. ఈ తరుణంలో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అయితే ఈ ఘటనను మంత్రి విడదల రజని ఖండించారు. టీడీపీ గుండాలే ఈ దాడి చేశారని, దీని వెనుక ఎవరున్నా వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇది పక్కా ప్లాన్‌తోనే జరిగిన దాడి అని, రాళ్లు తీసుకువచ్చి దాడికి పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు. ఇలాంటి దాడులతో ఏమాత్రం భయపెట్టలేరని స్పష్టం చేశారు.
బీసీ మహిళ అయిన తనపై ఇలాంటి కుట్రలు చేస్తున్నారని, టీడీపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. ఇలాంటి పార్టీలు అధికారంలోకి వస్తే ఏం జరగబోతుందో ప్రజలు ఆలోచించాలని కోరారు. తమకు ప్రజల మద్దతు ఉన్నదని, ఇలాంటి దాడులు ఎలా ఎదుర్కోవాలో, ఎలా బుద్ది చెప్పాలో తమకు తెలుసని మంత్రి విడదల రజని అన్నారు.