జగనన్న విదేశీ విద్యా దీవెన నిధుల(Vidya Deevena Funds)ను ఏపీ ముఖ్యమంత్రి(AP CM) వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41.60 కోట్లను విడుదల చేశారు. సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 95 మందికి విద్యా దీవెన కింద ప్రోత్సాహకాన్ని అందజేశారు.
జగనన్న విదేశీ విద్యా దీవెనపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని సీఎం జగన్ తెలిపారు. పలువురు విద్యార్థులు విదేశాల్లో టాప్ యూనివర్సిటీల్లో చదువుతున్నారని తెలిపారు.
పేద విద్యార్థుల తలరాత మార్చేందుకే ఈ పథకమని జగన్ వెల్లడించారు. రూ. 8లక్షల వార్షికాదాయంలోపు ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడొద్దన్నారు. సివిల్స్ అభ్యర్థులకు జగనన్న ప్రోత్సాహకం అందిస్తున్నామన్నారు.
సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం మెయిన్స్ పాస్ అయితే రూ.లక్షా 50 వేలు అందిస్తున్నామని వెల్లడించారు. ఈ పథకం పెట్టినప్పటి నుంచి తనకెంతో సంతృప్తినిచ్చిందన్నారు జగన్. కెరీర్‌లో గొప్పస్థాయికి చేరుకున్నాక రాష్ట్ర ప్రజలకు చేదోడుగా నిలవాలని విద్యార్థులకు సూచించారు. సీఈవోల స్థాయికి ఎదిగి రాష్ట్రానికి మంచి చేయాలని ఆకాంక్షించారు.
ఇక, ఏపీ ప్రభుత్వం గడిచిన 10నెలల్లో జగనన్న ‘విదేశీ విద్యా దీవెన’ కింద 408మంది విద్యార్థులకు రూ.107.08 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేసింది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన 320 కాలేజీల్లో ఉచితంగా చదువుకునే అవకాశాన్ని జగన్ ప్రభుత్వం కల్పిస్తోంది.