ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే(DMDK) వ్యవస్థాపకుడు, కెప్టెన్ విజయకాంత్ (Vijayakanth) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన పూర్తి స్థాయిలో కోలుకోవడంతో సోమవారం ఆయన డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది.
71 ఏళ్ల విజయకాంత్ అనారోగ్యంతో నవంబర్ 18న చెన్నె(Chennai)లోని మియాట్ ఆసుపత్రి(Miyat Hospital) లో చేరారు. 23 రోజుల పాటు ఆయనకు వైద్యం అందించారు. ఆయన కోలుకోవడంతో డాక్టర్ల సూచన మేరకు కెప్టెన్ విజయకాంత్ ఇవాళ చెన్నెలోని తన నివాసానికి వెళ్లారు. విషయం తెలుసుకున్న విజయకాంత్ ఫ్యాన్స్, డీఎంకే కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విజయకాంత్ ఆరోగ్య పరంగా ఇప్పటి వరకు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. శ్వాస సంబంధిత వ్యాధితో కొద్ది రోజులుగా ఇబ్బందిపడుతున్నారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. కెప్టెన్ విజయకాంత్‌కు గతంలో డయాబెటిస్ కారణంగా కుడికాలి మూడు వేళ్లను తొలగించారు.
2020 సెప్టెంబర్ నెలలో విజయకాంత్ కరోనా బారినపడ్డారు. 10 రోజుల చికిత్స తర్వాత ఆయన మహమ్మారి నుంచి కోలుకున్నారు. రెండేళ్ల క్రితం విజయకాంత్ సింగపూరులో చికిత్స చేయించుకున్నా పూర్తిగా కోలుకోలేదు. అనారోగ్యంతో కొద్దిరోజులుగా విజయకాంత్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. దీంతో కెప్టెన్ భార్య ప్రేమలత ముందుండి పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు.